Saving Vs Investing : సంపదను సృష్టించడంలో పొదుపు, పెట్టుబడిలో ఏది బెటర్? అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. సమగ్ర ఆర్థిక వ్యూహంలోపొదుపు, పెట్టుబడి రెండూ ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అయినప్పటికీ అవి విభిన్న ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి. కొత్తగా సంపాదన మొదలుపెట్టినవారు - పొదుపు, పెట్టుబడి మధ్య తేడా ఏమిటి? పొదుపు ఎంత చేయాలి? ఎప్పుడు పెట్టుబడి పెట్టడం మంచిది? అనే విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది.
పొదుపు అంటే ఏమిటి?
పొదుపు అంటే మీ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయకుండా పక్కన పెట్టడం. ఈ డబ్బు స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఉపయోగపడుతుంది. ఉదాహరణకు : అత్యవసర నిధిని ఏర్పాటు చేయడం, ఇల్లు, ఫ్లాట్, భూములు కొనుగోలు కోసం ప్లాన్ చేసుకోవడం, ఊహించని ఖర్చుల కోసం నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటివి. పొదుపు సొమ్మును సాధారణంగా సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి తక్కువ రిస్క్ ఉన్నవాటిలో ఉంచుతారు.
పెట్టుబడి అంటే ఏమిటి?
కొంత కాలంపాటు డబ్బును కొన్ని ఆర్థిక సాధనాల్లో పెట్టడమే పెట్టుబడి. ఈ పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి. అలాగే సంపదను పెంచుకోవడానికి దోహదపడతాయి. అయితే పొదుపుతో పోలిస్తే, పెట్టుబడుల్లో కాస్త రిస్క్ ఎక్కువ ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించే అవకాశం ఉంటుంది. సాధారణ పెట్టుబడి సాధనాల్లో స్టాక్స్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ మొదలైనవి ఉంటాయి.
పన్ను ప్రయోజనాలు
ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు వస్తాయి. స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల వాటి విలువ కాలక్రమేణా పెరిగి గణనీయమైన లాభాలను పొందవచ్చు. అలాగే పన్ను మినహాయింపులను పొందొచ్చు.
కాంపౌండింగ్ రాబడి
పెట్టుబడులకు సంబంధించిన ప్రయోజనాల్లో 'కాంపౌండింగ్ ఎఫెక్ట్' ఒకటి. పెట్టుబడులపై వచ్చే ఆదాయం చక్రవడ్డీ తరహాలో బాగా పెరుగుతుంది. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేవారికి దీని వల్ల ఎంతో లాభం చేకూరుతుంది.
తక్కువ వయసులోనే పెట్టుబడులు
సంపాదన ప్రారంభించిన తర్వాత, తక్కువ వయసులోనే పెట్టుబడులు ప్రారంభించడం మంచిది. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిపుష్ఠిని పొందొచ్చు. అలాగే ఇల్లు కొనడం, పిల్లల విద్య కోసం నిధులు సమకూర్చుకోవడం, రిటైర్మైంట్ తర్వాత ఖర్చుల కోసం ప్లాన్ చేసుకోవచ్చు.
పొదుపు, పెట్టుబడి మధ్య తేడాలివే!
పొదుపుఅనేది అత్యవసర నిధి వంటి స్వల్పకాలిక లక్ష్యాల కోసం ఉపయోగపడతుంది. పదవీ విరమణ లేదా ఆస్తిని కొనుగోలు చేయడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు పెట్టుబడులు బాగా సరిపోతాయి. పొదుపు ఖాతాల్లో మదుపు చేయడానికి తక్కువ కాల వ్యవధి సరిపోతుంది. అదే పెట్టుబడులు అయితే మార్కెట్ ఒడిదుడుకులను అధిగమించడానికి, మంచి రాబడిని పొందడానికి ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
రిస్క్ ఎందులో ఎక్కువ
సేవింగ్స్ కాస్త తక్కువ రిస్క్‌తో కూడుకున్నవి. ఇందులో మీ డబ్బులను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు అధిక రిస్క్‌తో ఉంటాయి. కొన్నిసార్లు మార్కెట్ల అస్థిరత కారణంగా నష్టాలను భరించాల్సి వస్తుంది. కొన్నిసార్లు అధిక లాభాలను అందిస్తాయి.
పెట్టుబడిపై రాబడి
సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లు సాధారణంగా ఏడాదికి 3-4 శాతం వరకు రాబడిని అందిస్తాయి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు చాలా ఎక్కువ రాబడిని అందిస్తాయి. కొన్నిసార్లు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా 10-15 శాతం లేదా అంతకంటే ఎక్కువ లాభాలను ఇస్తాయి.
పొదుపు Vs పెట్టుబడి - ఏది బెటర్?
పొదుపు, పెట్టుబడిలో ఏది ఎంచుకోవడం అనేది మీ ఆర్థిక లక్ష్యాలు, కాల పరిమితి, నష్టాన్ని భరించే శక్తిపై ఆధారపడి ఉంటుంది. సేవింగ్స్ ఆర్థిక భద్రతను ఇస్తాయి. సులభంగా నగదును వాడుకోవడానికి వీలు కల్పిస్తాయి. ప్రధానంగా స్వల్పకాలిక లక్ష్యాలు, అత్యవసర నిధుల కోసం మీరు చేసిన పొదుపు ఉపయోగపడుతుంది. పెట్టుబడుల విషయానికి వస్తే, ఇవి కాస్త రిస్క్‌తో కూడుకుని ఉంటాయి. అయితే ఇందులో అధిక రాబడిని పొందొచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించాలంటే పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, సంపదను సృష్టించడానికి పొదుపు, పెట్టుబడి మధ్య సమతుల్యతను పాటించాలి. మీ ఆదాయంలో కొంత భాగాన్ని దీర్ఘకాలిక వృద్ధి కోసం పెట్టుబడులకు కేటాయింటాలి. మరికొంత భాగాన్ని తక్షణ, స్వల్పకాలిక అవసరాల కోసం పొదుపు చేసుకోవాలి. అప్పుడే మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు. భవిష్యత్‌లో మంచి సంపదను సృష్టించుకోగలుగుతారు.
డెబిట్ కార్డ్ మర్చిపోయారా? డోంట్ వర్రీ - ATM నుంచి మనీ విత్‌డ్రా చేయండిలా! - Cardless Cash Withdrawal From ATM
స్టన్నింగ్ ఫీచర్స్‌తో - త్వరలో లాంఛ్ కానున్న టాప్-5 బైక్స్ & స్కూటీస్ ఇవే! - Upcoming Bikes Under 1 Lakh