Elon Musk On OpenAI : ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కన్ను ఇప్పుడు కృత్రిమ మేధ సంస్థ ఓపెన్‌ఏఐపై పడింది. గత కొంతకాలంగా ఓపెన్ఏఐ కంపెనీపై విమర్శలు గుప్పిస్తున్న మస్క్ తాజాగా దానిని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన నేతృత్వంలో పెట్టుబడిదారుల బృందం ఈమేరకు ప్రకటించింది. అంతేకాదు ఓపెన్ఏఐకి భారీ ఆఫర్ కూడా ఇచ్చింది.
ఓపెన్ఏఐకి భారీ ఆఫర్
ఓపెన్‌ఏఐని 97.4 బిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో దాదాపు రూ.8.5లక్షల కోట్ల)కు కొనుగోలు చేస్తామంటూ మస్క్ నేతృత్వంలోని ఇన్వెస్టర్ల బృందం ప్రకటించింది. అయితే ఈ ఆఫర్‌ను ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తిరస్కరించారు. దానికి ప్రతిగా అవసరమైతే 'ఎక్స్'నే కొనుగోలు చేస్తానని వ్యాఖ్యానించారు. 'మీ ఆఫర్ వద్దు. కానీ, మీరు కోరుకుంటే ఎక్స్నే 9.74 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.85వేల కోట్లు) మేం కొనుగోలు చేస్తా' అని ఆల్ట్మన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
no thank you but we will buy twitter for $9.74 billion if you want
— Sam Altman (@sama) February 10, 2025
తొలుత పెట్టుబడులు- ఆ తర్వాత అదే సంస్థపై దావా
2022 నవంబరులో వచ్చిన ఓపెన్‌ఏఐకి చెందిన చాట్ జీపీటీ ఆరు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందింది. 2015లో ఓపెన్‌ఏఐని శామ్ ఆల్టమన్ బృందం స్థాపించినప్పుడు మస్క్ అందులో పెట్టుబడులు పెట్టారు. 2018లో మస్క్ కంపెనీని వీడారు. మైక్రోసాఫ్ట్ ఓపెన్‌ఏఐలో పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ఓపెన్‌ఏఐపై మస్క్ కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో దావా వేశారు. కంపెనీ స్థాపించినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారంటూ అందులో ఆరోపించారు. ఇంకా ఈ దావాపై తీర్పు వెలువడలేదు. కాగా, మస్క్ 2022 అక్టోబరులో 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్(ప్రస్తుతం ఎక్స్)ను కొనుగోలు చేశారు.
అందుకు ఎలాన్ మస్క్ తగిన వ్యక్తి : మార్క్ టోబెరాఫ్
"ఓపెన్‌ఏఐని పూర్తిగా లాభాపేక్ష గల కంపెనీగా మార్చాలని శామ్ ఆల్ట్ మన్, ఆయన బోర్డు కోరుకుంటే అందుకు మేం సిద్ధం. దానిపై నియంత్రణ వదులకునేందుకు వారికి మా ఛారిటీ తగిన పరిహారం చెల్లిస్తుంది. ఓపెన్‌ఏఐ సాంకేతికతను రక్షించడానికి, అభివృద్ధి చేయడానికి తగిన వ్యక్తి ఎలాన్ మస్క్." అని మస్క్ తరఫు న్యాయవాది మార్క్ టోబెరాఫ్ తెలిపారు