Retirement Calculator India :మన జీవిత కాలంలో సుమారు 20 నుంచి 30 సంవత్సరాలు డబ్బులు సంపాదించడం కోసమే కష్టపడుతుంటాము. ఈ క్రమంలో ఎంతో కొంత సొమ్మును ఆదా చేస్తుంటాము. అలా కూడబెట్టిన నగదు మన రిటైర్మెంట్ తర్వాత ఉపయోగపడుతుందని అనుకుంటాము. ఆ మేరకు ఇలాంటి చిన్న ప్రయత్నాలు చేస్తుంటాము.
SEBI Retirement Calculator :అయితే ముఖ్యంగా మన దేశంలో ఒక వ్యక్తి తన ఉద్యోగం లేదా బాధ్యతల నుంచి రిటైర్ అయ్యే సమయానికి ఎంత మొత్తం రిటైర్మెంట్ డబ్బును కిలిగి ఉండాలి? లేదా పదవీ విరమణ తర్వాత గడిపే జీవితానికి ఎంత మేర డబ్బును ముందు నుంచే ఆదా చేయాలి అనే కచ్చితమైన ప్రణాళికను కలిగి ఉండడు. ఇలాంటి వారికోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) కొద్దిరోజుల క్రితం ప్రత్యేకంగా ఓ రిటైర్మెంట్ క్యాలికులేటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది మీరు సౌకర్యవంతంగా పదవీ విరమణ చేయడానికి అవసరమైన రిటైర్‌మెంట్ నిధిని నిర్ణయించడంలో మీకు సహాయం చేస్తుంది.
అంతేకాకుండా దీని సాయంతో ఏ వయసు వారు ఏ సమయంలో రిటైర్మెంట్ సేవింగ్స్‌ను ప్రారంభించాలి? ఎంత మొత్తంలో ఆదా చేసి ఉంచుకోవాలి? అనే వివరాలను సైతం క్లుప్తంగా వివరించింది. ఇందుకోసం అనుసరించాల్సిన ప్రక్రియను తమ పోర్టల్‌లో పొందుపరిచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సెబీ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు.
పదవీ విరమణ మొత్తాన్ని క్యాలికులేట్ చేసే సమయంలో మీరు పరిగణించవలసిన ముఖ్యమైన అంశాలు.
1. ప్రస్తుత నెలవారీ ఖర్చులు పదవీ విరమణ తర్వాత కూడా ఉంటాయని గుర్తుంచుకోండి.
2. పదవీ విరమణలో ఎదురయ్యే వార్షిక ఖర్చుల అంచనా.
3. నెలవారీ ఖర్చుల మొత్తం సగటు(వార్షిక ఖర్చు/12నెలలు).
4. పదవీ విరమణకు ముందు ఉన్న ద్రవ్యోల్బణం పరిశీలన.
5. మీ ప్రస్తుత వయసు.
6. మీరు పదవీ విరమణ చేయాలనుకుంటున్న వయస్సు అంచనా.
7. మీరు ఎంత కాలంపాటు జీవిస్తారో అంచనా వేయండి.
8. పదవీ విరమణకు ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉందో చూసుకోండి.
9. పదవీ విరమణ పొందిన మొదటి సంవత్సరంలో నెలవారీ ఖర్చులు ఏ విధంగా ఉండనున్నాయో అసెస్ చేయండి.
10. ఎన్ని సంవత్సరాలు పదవీ విరమణ జీవితాన్ని గడపాలనుకుంటున్నారో ముందే నిర్ణయించుకోండి.
11. పదవీ విరమణ సమయంలో ద్రవ్యోల్బణం అంచనా.
12. పదవీ విరమణ నిధి నుంచి పోస్ట్-ట్యాక్స్ సగటు రాబడి అంచనా.