RBI Paytm Issue :పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించిన వేళ అందుకు గల కారణాలపై మరిన్ని కీలక అంశాలు వెలుగు చూశాయి. సరైన గుర్తింపు లేకుండా పేమెంట్స్ బ్యాంక్‌లో వందలాది బ్యాంకు ఖాతాలను సృష్టించినట్లు తేలడమే ఆర్‌బీఐ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిసింది.
ఆడిటింగ్‌లో బయటపడ్డ వాస్తవాలు!
ఒకే పర్మినెంట్ అకౌంట్ నంబర్- పాన్ కార్డుతో వెయ్యికి పైగా పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు లింక్ అయినట్లు ఆర్‌బీఐ నిర్ధరించింది. ఆడిటింగ్‌కు సంబంధించి పేటీఎం సమర్పించిన రిపోర్టు తప్పులతడకగా ఉన్నట్లు ఆర్బీఐతో పాటు ఆడిటర్లు తేల్చారు. కేవైసీ సరిపోలని చాలా ఖాతాల నుంచి కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఆర్‌బీఐ గుర్తించింది. ఈ క్రమంలో మనీలాండరింగ్ కూడా జరిగి ఉండొచ్చన్న అనుమానాలు తలెత్తినట్లు అధికారులు తెలిపారు.
ఆడిటింగ్ సమాచారాన్ని ఈడీ, కేంద్ర హోంశాఖ, ప్రధానమంత్రి కార్యాలయానికి ఆర్‌బీఐ పంపించింది. అక్రమ కార్యకలాపాలు జరిగినట్లు ఆధారాలు లభిస్తే ఈడీ దర్యాప్తు జరగుతుందని అధికారులు వివరించారు. పేమెంట్స్ బ్యాంకు, పేటీఎం మాతృసంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్ మధ్య అనుసంధానానికి సంబంధించి గవర్నెన్స్ స్టాండర్డ్స్‌లో లోపాలు బహిర్గతం అయినట్లు తెలిపారు. సంస్థ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని ఆడిట్‌లో తేలినందునే సంస్థపై మరింతగా పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సి వస్తోందని ఆర్‌బీఐ వెల్లడించింది.
మనీలాండరింగ్‌కు అవకాశం!
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు 35 కోట్ల ఇ-వాలెట్లు ఉన్నాయి. ఇందులో 31 కోట్ల ఖాతాలు ఇన్ యాక్టివ్‌లోనే ఉన్నాయి. మిగిలిన 4 కోట్ల ఖాతాలు కూడా జీరో బ్యాలెన్స్, స్వల్ప మొత్తాలను కలిగి ఉన్నాయి. యాక్టివ్‌లో లేని ఖాతాలను మనీలాండరింగ్ కోసం వినియోగించారనే అనుమానాలను ఆర్‌బీఐ వ్యక్తం చేసింది.