Personal Loan for 25000 Salary: అనుకోకుండా కొన్ని ఆర్థిక అవసరాలు వస్తుంటాయి. వివాహాది శుభకార్యాలు, టూర్‌లు, ఇంటి పునర్నిర్మాణం, ఇంటి మరమ్మతులు ఇలా ఏ అవసరం వచ్చినా వేతన జీవులకు అప్పటికప్పుడు డబ్బులు సర్దుబాటు కావు. అలాంటప్పుడు వ్యక్తిగత రుణాల కోసం ప్రయత్నాలు మొదలు పెడుతుంటారు. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల(ఎన్‌బీఎఫ్‌సీ)కు దరఖాస్తు చేస్తుంటారు. అవి మంజూరు చేసే రుణాలను తీసుకొని, ప్రతినెలా ఈఎంఐల రూపంలో వాటిని తీరుస్తుంటారు. అయితే రుణాల మంజూరు ప్రక్రియ మనం అనుకున్నంత సులభంగా జరిగిపోదు. రూ.25వేల వేతనం కలిగినవారు వ్యక్తిగత రుణాలను పొందడం ఎలాగో ఈ కథనంలో తెలుసుకుందాం.
క్రెడిట్ స్కోర్ ఆధారంగా
21 నుంచి 60 ఏళ్లలోపు వారు వ్యక్తిగత రుణం పొందడానికి అర్హులు. ఉద్యోగం చేసేవారికి క్రెడిట్ స్కోరు ఆధారంగా రుణాన్ని మంజూరు చేస్తారు. సాధ్యమైనంత ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్నవారికే రుణాలు సులభంగా మంజూరవుతాయి. రుణం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి దాన్ని సకాలంలో తిరిగి చెల్లించగలడా? లేడా? అనే అంశాన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ప్రధానంగా పరిశీలిస్తాయి. సిబిల్ స్కోరు బాగుంటే, అతడి వేతన స్థాయిని బట్టి రుణాన్ని మంజూరు చేస్తాయి.
రూ.25వేల వేతనంతో రుణం పొందొచ్చా ?
వ్యక్తిగత రుణాన్ని మంజూరు చేసే క్రమంలో కొన్ని బ్యాంకులు నిర్దిష్ట వేతన పరిమితిని విధిస్తాయి. ఇది బ్యాంకులను బట్టి మారిపోతుంటుంది. కొన్ని బ్యాంకులు ప్రతినెలా రూ.25వేల నుంచి రూ.30వేల దాకా వేతనం పొందే వారికి రుణాలను మంజూరు చేస్తుంటాయి. ఇంకొన్ని బ్యాంకులు ఇంతకంటే ఎక్కువ వేతనం ఉన్నవారికే రుణాలిస్తాయి. వేతనంతో పాటు సిబిల్ స్కోరును కూడా తప్పకుండా పరిశీలిస్తాయి. కనీసం 700 కంటే ఎక్కువ స్కోరు ఉంటే రుణం మంజూరయ్యే అవకాశాలు పెరుగుతాయి.