IT rules for Selling Gold and Silver :బంగారం, వజ్రాలు, వెండితో చేసిన ఆభరణాలు చరాస్తిగా లెక్కలోకి వస్తాయి. చాలామంది వీటిని పెట్టుబడి మాధ్యమంగా భావిస్తారు. ఆర్థిక అవసరాలు వచ్చినప్పుడు ఆభరణాలను విక్రయిస్తుంటారు. అలాంటప్పుడు సుదీర్ఘ కాలంగా మన దగ్గరున్న ఆభరణాలపై 'దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను' (లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్)ను విధిస్తారు. ఆభరణాలను విక్రయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని పన్ను నియమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
24 నెలలకు ముందు, తర్వాత
చాలామంది వ్యక్తుల వార్షిక ఆదాయాలు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి వారు ఆభరణాలను విక్రయిస్తే ఏదైనా పన్ను మినహాయింపు లభిస్తుందా? కనీసం అలాంటి వారికైనా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును మినహాయిస్తారా? వారు విక్రయించే ఆభరణాలపై ట్యాక్స్ ఎంత పడుతుంది ? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకునే ముందు మనమంతా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేమిటంటే ఆభరణాలు కూడా మూలధన ఆస్తులే. వాటి విక్రయం ద్వారా ఏమాత్రం లాభాన్ని ఆర్జించినా దానిపై పన్నును విధిస్తారు. ఆ పన్ను ఎంత ఉండాలి అనేది ఆభరణాలను కొన్న తర్వాత 24 నెలల్లోగా విక్రయించారా? 24 నెలల తర్వాత విక్రయించారా ? అనే దానిపై ఆధారపడి నిర్ణయమవుతుంది. 24 నెలల తర్వాత విక్రయించే ఆభరణాల వచ్చే లాభాలపై 'దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను'ను విధిస్తారు. 24 నెలల్లోగా విక్రయించే ఆభరణాలపై 'స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను'ను విధిస్తారు. స్వల్పకాలిక మూలధనం అంటే వ్యక్తులు సాధారణంగా నిత్యం ఆర్జించే ఆదాయం లాంటిదే. సాధారణంగా వ్యక్తుల ఆదాయంపై ఎంతైతే పన్నును విధిస్తారో అంతే పన్నును 24 నెలల్లోగా విక్రయించే ఆభరణాలపైనా విధిస్తారు.