NPS Vs PPF :ఊరుకుల పరుగుల జీవితం గడిచిపోతోంది. పదవీ విరమణ తరువాత అయినా ఆర్థిక ఒత్తిడి లేకుండా ప్రశాతంగా జీవితం సాగాలంటే, ఉద్యోగంలో ఉండగానే పదవీ విరమణకు కావాల్సిన నిధిని ఏర్పాటు చేసుకోవాలి. పదవీవిరమణ తర్వాత పని ఒత్తిడి ఉండదు. కాబట్టి, మీకు నచ్చినట్లు సమయాన్ని వినియోగించుకోవచ్చు. కానీ అందుకు డబ్బు కావాలి. ఆర్థిక ఒత్తిడి లేనప్పుడు మాత్రమే అందమైన జీవితాన్ని చూడగలం. కాబట్టి ఉద్యోగంలో ఉండగానే పదవీ విరమణకు కావాల్సిన నిధిని ఏర్పాటు చేసుకోవాలి. పదవి విరమణ తర్వాత మంచి రిటైర్‌మెంట్ కార్పస్‌ను పొందాలంటే, ఉద్యోగం ప్రారంభించిన వెంటనే మీరు రిటైర్‌మెంట్ ప్లానింగ్ చేసుకోవడం మంచిది. ఇందుకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఈ రెండు ప్రభుత్వ స్కీమ్‌లు రిటైర్‌మెంట్ సమయంలో మంచి ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే, ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
పీపీఎఫ్ అనేది ప్రభుత్వం నిర్వహించే దీర్ఘకాలిక పొదుపు పథకం. ఈ పథకాన్ని ప్రభుత్వం 1965లో ప్రారంభించింది. ఈపీఎఫ్ కిందకి రాని వ్యక్తులు కూడా పదవీవిరమణ నిధిని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీని కాలవ్యవధి 15 సంవత్సరాలు. ఏడాదికి కనీసం రూ.500, గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంది. అంటే పీపీఎఫ్‌లో మీరు ఏడాదికి రూ.1.5 లక్షలు డిపాజిట్ చేస్తే 7.1 శాతం వడ్డీ కలుపుకుని మీకు 15 ఏళ్ల తర్వాత రూ.40.68 లక్షలు వస్తాయి. ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ ప్రకారం, ఈ మొత్తంపై పన్ను లేదు. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా పీపీఎఫ్ ఖాతాను తెరిచి అందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఏడేళ్ల తర్వాత ప్రీమెచ్యూర్ విత్ డ్రాయల్ కూడా చేసుకోవచ్చు. రిస్కు వద్దనుకునే వారు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయాలి.
జాతీయ పింఛను పథకం(NPS)
ఇది పదవీ విరమణ కోసం స్వచ్ఛందంగా కాంట్రిబ్యూట్ చేసే పథకం. ఏ బ్యాంకులో అయినా లేదా పోస్టాఫీసు లేదా ఇన్సూరెన్స్ కంపెనీలో అయినా నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను తెరవవచ్చు. ఉద్యోగి జీతంలో 20 శాతం వరకు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది పదవీ విరమణ పథకం కాబట్టి 60 ఏళ్ల వయసు తర్వాత గానీ పూర్తి పెట్టబడులు ఉపసంహరించుకోలేరు. అప్పుడు కూడా అరవై శాతం పెట్టుబడిని మాత్రమే తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతం పెన్షన్ ప్లాన్ కొనుగోలుకు వినియోగిస్తారు. ఈ మొత్తం నుంచి సబ్‌స్క్రైబర్‌కు పెన్షన్ వస్తుంది. యాన్యుటీ అనేది మీకు, మీ ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఉంటుంది. ఎంత ఎక్కువ యాన్యుటీ కింద పెడితే, అంత ఎక్కువ పెన్షన్. అయితే ఎన్‌పీఎస్ కింద వచ్చే పెన్షన్ పన్ను కిందకు వస్తుంది. రిటర్నులు దీనిలో ఫిక్స్‌డ్‌గా ఉండవు. ఎన్‌పీఎస్ స్కీమ్ 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉంటుంది.