PAN 2.0 Project : కేంద్ర ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. దీని ద్వారా పన్ను చెల్లింపుదారులకు ఉచితంగా క్యూఆర్ కోడ్ ఫీచర్ ఉన్న కొత్త పాన్ కార్డులను అందించనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ.1,435 కోట్ల రూపాయలను కేటాయించింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం భేటీ అయిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. దీని ద్వారా ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అన్ని డిజిటల్ సిస్టమ్‌ల కోసం "కామన్ బిజినెస్ ఐడెంటిఫయర్"ను రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త పాన్ బెనిఫిట్స్ ఏమిటి?
- "పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపన్ను శాఖ పాన్ జారీ చేస్తుంది. ఇది ఒక 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. ప్రస్తుతం 3-4 వేర్వేరు బిజినెస్ ఐడెంటిఫయర్స్ ఉన్నాయి. కానీ ఇకపై కేవలం ఒకే ఒక బిజినెస్ ఐడెంటిఫయర్ మాత్రమే ఉండాలని మేము సంకల్పించాం" అని సమాచార, ప్రసార శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
- ఇప్పటికే వ్యక్తులకు, వ్యాపారులకు జారీ చేసిన పాన్ కార్డులు చెల్లుతాయని అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. పైగా ఆ కార్డులోని 10 అంకెల నంబర్ కూడా మార్చాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
- 'పాన్ 2.0 ప్రాజెక్ట్‌లో నూతన సాంకేతికతను పొందుపరుస్తున్నాం. దీని వల్ల పన్ను చెల్లింపుదారులు మరింత నాణ్యమైన, మెరుగైన సేవలు అందించడానికి, వేగంగా సర్వీస్ డెలివరీ చేయడానికి వీలవుతుంది' అని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
- "ఈ ప్రాజెక్ట్ పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. ఒకే దగ్గర డేటా మొత్తం ఉంటుంది. దీని వల్ల ఖర్చు బాగా తగ్గుతుంది. మరింత భద్రంగా, వేగంగా సేవలు అందించడానికి వీలవుతుంది. నిర్దిష్ట ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అన్ని డిజిటల్ సిస్టమ్‌లకు పాన్ అనేది సాధారణ ఐడెంటిఫయర్‌గా ఉంటుంది. కనుక డిజిటల్ ఇండియా సాకారానికి ఇది కూడా ఇతోధికంగా తోడ్పడుతుంది." అని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
- పాన్ డేటాను ఉపయోగించే సంస్థలు అన్నీ, పన్ను చెల్లింపుదారుల వ్యక్తిగత డేటా రక్షణ కోసం పాన్ డేటా వాల్డ్ సిస్టమ్‌ను కలిగి ఉండాల్సిందే. అంతేకాదు ఈ సంస్థలు పాన్ 2.0 కింద ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను కూడా మరింత బలోపేతం చేసుకోవాలి.
- పాన్ 2.0 అనేది ఒక ఈ-గవర్నన్స్ ప్రాజెక్ట్. ఇది పన్ను చెల్లింపుదారుల PAN/TAN రిజిస్ట్రేషన్ సర్వీస్‌లను మరింత సరళతరం చేస్తుంది.
- 'ప్రస్తుతం ఉన్న పాన్/టాన్ 1.0 ఏకో -సిస్టమ్‌కు ఒక అప్‌గ్రేడ్. దీని ద్వారా కోర్, నాన్-కోర్ పాన్/ టాన్ కార్యకలాపాలతో పాటు, పాన్ ధ్రువీకరణ సేవలను కూడా ఏకీకృతం అవుతాయి' అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
- ప్రస్తుతం భారత్‌లో 78 కోట్ల పాన్ కార్డులు జారీ అయ్యాయి. వీటిలో 98 శాతం వరకు ఇండివిడ్యువల్స్‌కు జారీ చేసినవి ఉన్నాయి.
మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పనిలేదు!
పాన్ 2.0 ప్రాజెక్ట్ కింద ఆటోమేటిక్‌గా పాన్ కార్డులు అప్డేట్ అవుతాయి. కనుక ఇప్పటికే పాన్ కార్డ్ కలిగి ఉన్నవాళ్లు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ పాన్‌కార్డ్‌లోని వివరాలు ఏమైనా మార్చుకోవాలని అనుకుంటే కరెక్షన్/ అప్డేట్ చేసుకోవచ్చు. అంటే మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్ లాంటి వాటిని అప్డేట్ చేసుకోవచ్చు.