TGSRTC Special Buses To Mahashivratri : ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పండుగ సందర్బంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలను సందర్శించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడిపించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాలకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని అధికారులకు స్పష్టం చేశారు.
సమీక్ష సమావేశం : మహాశివరాత్రి సందర్బంగా ప్రత్యేక బస్సు సర్వీసుల ఏర్పాట్లపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన అధికారిక నివాసంలో ఆయా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం కంటే ఈసారి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలకు వచ్చే అవకాశం ఉంటుందని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు చేసుకోవాలని అధికారులకు సూచించారు. బస్టాండ్ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆ ప్రాంతాలలో ప్రత్యేక అధికారులను ఏర్పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సీఎంకు వేములవాడ ఎమ్మెల్యే ఆహ్వానం : మరోవైపు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 25, 26, 27వ తేదీన జరగనున్న మహాశివరాత్రి వేడుకలకు హాజరుకావాలని కోరుతూ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లను ఆహ్వానించారు.

వేములవాడ ఆలయం విస్తరణ : సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందించే సమయంలో వేములవాడ ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేయగా ఈవో వినోద్ కుమార్ ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ పనుల గురించి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను సీఎం రేవంత్ రెడ్డి అడిగి వివరాలను తెలుసుకున్నారు. మహాశివరాత్రి జాతర ఘనంగా నిర్వహించాలని సూచించారు. రహదారి వెడల్పునకు సంబంధించి పరిహారం త్వరగా విడుదల చేయాలని సీఎం అధికారులకు సూచించారు.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయ విస్తరణకు అవసరమయ్యే భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులపై సీఎం చర్చించారు.
ఆ రూట్లో బస్ టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ
'సంక్రాంతి'తో బ్లాక్‌బస్టర్ కొట్టిన తెలంగాణ RTC - రూ.100 కోట్లు దాటిన కలెక్షన్స్!