Upcoming Cars In Next 2 Weeks : మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. త్వరలో భారత మార్కెట్లోకి మహీంద్రా, హోండా, ఆడి కార్లు లాంఛ్ కానున్నాయి. మరెందుకు ఆలస్యం వాటి ఫీచర్లు, డిజైన్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం రండి.
Mahindra XEV 9e and BE 6e
మహీంద్రా కంపెనీ రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 26న మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6ఈ మోడల్ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుంది. ఇవి రెండు బ్యాటరీ ఆప్షన్లలో రానున్నట్లు తెలుస్తోంది. 60kWh, 79kWh బ్యాటరీలతో ఈ ఎస్‌యూవీలు మార్కెట్లో లాంఛ్ కానున్నట్లు సమాచారం. ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే 450 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు.
బీఈ 6ఈ ఈవీ కారులో డ్యూయల్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌తో కూడిన కాక్ పిట్ ఉంటుంది. అలాగే ఇంటీరియర్ బాగుంటుంది. ఎక్స్ఈవీ 9ఈ ప్రత్యేకమైన ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ సెటప్‌తో లభిస్తుంది.
New Generation Honda Amaze
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా భారత్ మార్కెట్లోకి థర్డ్ జనరేషన్ అమేజ్ కారును లాంఛ్ చేసేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసింది. డిసెంబర్ 4న మార్కెట్లోకి న్యూ జెనరేషన్ హోండా అమేజ్‌ను విడుదల చేయనుంది. అయితే ఈ కొత్త జెనరేషన్ కారులో హోండా పలు మార్పులు చేసినట్లు, ముఖ్యంగా అధునాతన ఫీచర్స్‌ను పొందుపరిచినట్లు తెలుస్తోంది.
5 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్‌తో లింక్ అయిన 1.2లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారు లభిస్తుంది. హనీకోంబ్ గ్రిల్, విశాలమైన ఎయిర్ ఇన్‌లెట్, ఏడీఏఎస్ సూట్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉండనున్నట్లు తెలుస్తోంది.
Updated Audi Q7
ఆడి క్యూ7 కారు నవంబరు 28న భారత మార్కెట్లోకి రానుంది. ఈ లగ్జరీ కార్ల సంస్థ ఆడి నూతన ఆడి క్యూ7 మోడల్ కార్ల బుకింగ్‌లను ఇప్పటికే ప్రారంభించింది. ఆడి ఇండియా వెబ్‌సైట్ లేదా 'మై ఆడికనెక్ట్' మొబైల్ యాప్ నుంచి రూ.2లక్షలు చెల్లించడం ద్వారా బుక్ చేసుకోవచ్చని సూచించింది.
ఆ కారులో హెక్సాగోనల్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, లేజర్ డయోడ్లతో కూడిన కొత్త డీఆర్ఎల్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. 3.0 లీటర్ల వీ6 టర్బో-పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఆడి క్యూ7 కారు 340 హెచ్‌పీ పవర్, 500 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.6 సెకండ్లలో అందుకుంటుంది. 250 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో నడుస్తుంది.