MSME Loans Centre New Scheme :సొంతంగా చిన్న వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లకు ఏ హామీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఆ పథకం ద్వారా ఎంఎస్ఎంఈలకు రూ.100 కోట్ల వరకు రుణాలు ఇవ్వనుంది. ఆ రుణ హామీ పథకాన్ని అమలు చేసే విషయంపై త్వరలోనే కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటుంది!
ఈ మేరకు ఆ విషయాన్ని బెంగళూరులో జరిగిన నేషనల్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ ఔట్రీచ్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందాక ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, బ్యాంకులు రుణ హామీ పథకాన్ని అమలు చేస్తాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ఎంఎస్ఎంఈ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకుల్లో తీసుకునే రుణాలకు ఎలాంటి థర్డ్ పార్టీ హామీ కానీ, పూచీకత్తు కానీ అవసరం ఉండదని నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు.