Monsoon Driving Tips :వర్షాకాలం వచ్చిందంటే చాలు వాహనదారులు అలర్ట్ కావాలి. తమ వాహనాలను కండిషన్‌లో ఉంచుకోవడంపై ఫోకస్ పెట్టాలి. లేదంటే వర్షాల వేళ సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. బైక్ అయినా, కారు అయినా అలర్ట్‌గా ఉండటం ప్రతీ వాహనదారుడి బాధ్యత. దీనివల్ల వాహనం జీవిత కాలం పెరగడంతో పాటు ప్రమాదాల ముప్పు తగ్గిపోతుంది. అందుకే వర్షకాలంలో మన భద్రతకు భరోసా ఇచ్చే కారు, బైక్ డ్రైవింగ్ టిప్స్‌ను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కారు టైర్ల నిర్వహణ కీలకం
మీ కారు టైర్ల నిర్వహణపై ప్రధానంగా శ్రద్ధ పెట్టండి. టైర్లు ఎలా ఉన్నాయి? వాటి త్రెడ్స్ డెప్త్ ఎలా ఉంది? వర్షంలో వేగంగా డ్రైవింగ్ చేస్తే టైర్లు తట్టుకోగలవా? నీటిలో స్లిప్ అయ్యే రిస్క్ ఉందా? అనే ప్రశ్నలు వేసుకోండి. మీకు ఈజీగా సమాధానాలు దొరికిపోతాయి. ఈ విశ్లేషణ ఆధారంగా టైర్ల నిర్వహణ కోసం ఏం చేయాలో అది చేయండి. ఇక టైర్లలో నిర్దిష్టంగా గాలి ఉండేలా చూసుకోండి. కారులోని క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ ఎయిడ్ ఆప్షన్లను స్విచ్ ఆఫ్ చేయండి. కారు తడిగా ఉన్నప్పుడు క్రూయిజ్ కంట్రోల్ స్విచ్ ఆఫ్ చేయడం చాలా బెటర్. కారులోని అన్ని ఎలక్ట్రికల్ సిస్టమ్‌లను ఒకసారి మెకానిక్ ద్వారా తనిఖీ చేయించండి. కారులో ఎలాంటి ఓపెన్ వైరింగ్ లేకుండా జాగ్రత్తపడండి. కారులోని మెకానికల్ సిస్టమ్‌లు, ఇంధనం ట్యాంకు, లైట్లను చెక్ చేయించుకోండి.
ఇవి కండిషన్‌లో ఉండాల్సిందే!
కారులోని బ్రేక్ ప్యాడ్‌లు కండిషన్‌లో ఉండేలా చూసుకోండి. వాహనంలోని హెడ్ లైట్లు, టెయిల్ లైట్లు బాగా పని చేయాలి. వర్షాకాలంలో వీటి వినియోగం తప్పనిసరి. వర్షంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఈ లైట్ల వినియోగం ఎక్కువగా జరుగుతుంది. వీటిని చూసే ఇతర వాహనదారులు అలర్ట్ అవుతుంటారు. కారులోకి వర్షపు నీరు లీక్ అవుతోందా? ఏదైనా భాగానికి తుప్పు పట్టిందా? అనేది కూడా చూసుకోండి. తుప్పు ఉంటే వెంటనే దానికి సంబంధించిన పరిష్కారం కోసం సంబంధిత నిపుణుడిని సంప్రదించండి. వర్షాలు కురిసేటప్పుడు జర్నీ చేయాలంటే, కారులోని వైపర్‌లు, డీఫాగర్, వాషర్‌లు కండిషన్‌లో ఉండాలి. వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. వర్షాకాలంలో అతివేగంగా డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం. మన ముందు వెళ్తున్న వాహనం నుంచి కొంత దూరాన్ని మెయింటైన్ చేయాలి. సడెన్ బ్రేక్ వేద్దామనే భావన సరికాదు. ఎందుకంటే, వర్షకాలంలో సడెన్ బ్రేక్ వేస్తే కారు అదుపు తప్పే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.