Electric Car Buying Tips : మంచి మంచి ఎలక్ట్రిక్ బైక్/ కార్ కొనాలని అనుకుంటున్నారా? కానీ సరైన మోడల్‌ను ఎలా ఎంచుకోవాలో తెలియడం లేదా? అయితే ఇది మీ కోసమే. భారతీయ రోడ్లకు అనువైన మంచి ఎలక్ట్రిక్ కారును ఎలా ఎంచుకోవాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
భారత్‌లో ఈవీ కార్స్/ బైక్స్‌కు ఇప్పుడిప్పుడే బాగా డిమాండ్ పెరుగుతోంది. భవిష్యత్‌లో ఈ డిమాండ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ ఇప్పటికే తమ లేటెస్ట్ ఈవీ కార్లను, బైక్‌లను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చాయి. అయితే వీటిలో బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను ఎంచుకోవడమే అసలైన సవాల్. అయితే కొన్ని సింపుల్ టిప్స్ పాటించి, మీకు అనువైన బెస్ట్ ఈవీ మోడల్‌ను ఎంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
- బడ్జెట్ : మార్కెట్లో వివిధ ధరల శ్రేణుల్లో ఎలక్ట్రిక్ కార్లు/ బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. అంటే అఫర్డబుల్ రేంజ్ నుంచి మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ రేంజ్ వరకు అన్ని రకాల విద్యుత్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కనుక ముందుగా మీరు ఎంత బడ్జెట్లో కారు/ బైక్ కొనాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. అప్పుడే మీ బడ్జెట్లో దొరికే బెస్ట్ మోడల్స్‌ను పరిశీలించడానికి వీలవుతుంది. అంతేకాదు ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈవీ వెహికల్స్ కొనేవారికి ప్రత్యేకమైన ప్రోత్సాహాలు, సబ్సిడీలు ఇస్తోంది. వాటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు.
- డ్రైవింగ్ రేంజ్ : విద్యుత్ వాహనాలను ఎంచుకునేటప్పుడు కచ్చితంగా వాటి డ్రైవింగ్ రేంజ్ గురించి తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా రోజూ కారు/ బైక్ నడిపేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఫుల్ ఛార్జ్ చేస్తే సదరు ఈవీ కారు ఎన్ని కిలోమీటర్ల వరకు నడుస్తుందో చెక్ చేసుకోవాలి. సాధారణంగా ఈవీ కార్లు 200 కి.మీ - 500 కి.మీ డ్రైవింగ్ రేంజ్ కలిగి ఉంటాయి. కనుక మీ అవసరాలకు అనుగుణమైన బండిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
- ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రెక్చర్ : ఆటోమొబైల్ కంపెనీలు ఇంటివద్దే ఈవీ కార్లను, బైక్‌లను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా హోమ్ ఛార్జర్‌లను అందిస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలతో దూరప్రయాణాలు చేయడం సవాల్‌తో కూడుకున్న వ్యవహారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవీ వెహికల్స్ ఫుల్ ఛార్జ్ కావడానికి చాలా సమయం పడుతుంది. పైగా మన దేశంలో ఛార్జింగ్ స్టేషన్లు (ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) చాలా తక్కువ. పట్టణ ప్రాంతాల్లో కొంత వరకు కారు, బైక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెద్దగా లేవు. కనుక విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయాలని అనుకునేవారు ఈ విషయాన్ని కచ్చితంగా గమనించాలి.
- సర్వీస్ & వారెంటీ :ఎలక్ట్రిక్ కార్లను, బైక్‌లను కొనుగోలు చేసే ముందు కచ్చితంగా సదరు కంపెనీ వినియోగదారులకు మంచి సర్వీస్ అందిస్తోందా? లేదా? అనేది తెలుసుకోవాలి. అలాగే ఆ కంపెనీకి చెందిన సర్వీస్ సెంటర్లు మీకు దగ్గరగా ఉన్నాయా? లేదా? అక్కడ ప్రొఫెషనల్ వర్కర్స్ ఉన్నారా? లేదా? అనేది చూడాలి. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ కొనేముందు మంచి బ్రాండ్ ఉన్న కంపెనీని ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్లు మీకు మంచి సర్వీస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే బ్యాటరీ ప్యాక్‌లపై వారంటీలను అందించే బ్రాండ్‌లను ఎంచుకోవాలి.
- టెస్ట్ డ్రైవ్ : ఈవీ కారు లేదా బైక్ కొనేముందు కచ్చితంగా దానిని టెస్ట్ డ్రైవ్ చేయాలి. అప్పుడే ఆ బండి రియల్ ఎక్స్‌పీరియన్స్ మీకు తెలుస్తుంది. ముఖ్యంగా కారు అయితే దాని - కంఫర్ట్ లెవల్, పెర్ఫార్మెన్స్, రేంజ్, బ్యాటరీ పనితీరు, సేఫ్టీ తెలుస్తాయి.