What To Do If Loan Recovery Agents Harassment : ఇటీవల కాలంలో లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు బాగా పెరిగిపోతున్నాయి. దీనితో చాలా మంది ఈ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు పరువు పోతుందనే భయంతో, నిస్సహాయక స్థితిలో తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారు. నిజానికి రుణగ్రహీతలకు చాలా చట్టపరమైన హక్కులు ఉంటాయి. అవి తెలియకపోవడం వల్లనే, చాలా మంది రికవరీ ఏజెంట్ల అంటే భయపడుతుంటారు. కానీ అలాంటి అవసరం ఏమాత్రం లేదు.
వేధింపుల నుంచి రక్షణ?
ప్రస్తుతం చాలా బ్యాంక్‌లు, నాన్-బ్యాంకింగ్ సంస్థలు తమ కస్టమర్ బేస్‌ను పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకే చాలా సులువుగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. పైగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ ఆర్థిక సంస్థలకు సంబంధించిన రుణ నిబంధనలను కూడా సడలించింది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. లోన్లు సులువుగా లభించడం వల్ల రుణ ఎగవేతలు బాగా పెరిగాయి. వీటిని రాబట్టేందుకు బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు రికవరీ ఏజెంట్లను నియమిస్తున్నాయి. వీరు శృతిమించి ప్రవర్తిస్తూ, రుణగ్రహీతలను తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారు. అందుకే ఈ డిఫాల్ట్‌ల పెరుగుదల, రికవరీ ఏజెంట్ల వేధింపుల నుంచి రుణగ్రహీతలను రక్షించడానికి ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది.
ఆర్‌బీఐ మార్గదర్శకాలు
ఒక రుణగ్రహీత డిఫాల్టర్‌గా మారడానికి, ఉద్యోగం కోల్పోవడం లేదా ఇతర ఆర్థిక ఆకస్మిక సమస్యలు రావడం, లేదా మరేదైనా బలమైన కారణం ఉండొచ్చు. ఈ వాస్తవాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర్థం చేసుకుంది. అందుకే రుణగ్రహీతల, కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం, రుణగ్రహీతలు ఏమేమి చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.
ప్రూఫ్స్ అవసరం
రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని వేధిస్తుంటే, అందుకు సంబంధించి సాక్ష్యాలను మీరు చూపించాల్సి ఉంటుంది. అందుకే మీరు రికవరీ ఏజెంట్ నుంచి వచ్చే అన్ని కాల్స్, ఈ-మెయిల్స్, మెసేజ్‌లను రికార్డ్ చేసుకోవాలి. ఈ సాక్ష్యాలను (ప్రూఫ్‌లను) మీ లోన్ ఆఫీసర్‌కు లేదా ఆర్థిక సంస్థకు సమర్పించాలి.
ఆర్‌బీఐకి రిపోర్ట్
రికవరీ ఏజెంట్ల వేధింపులు ఎంతకూ ఆగకపోతే, అప్పుడు మీరు అన్ని వివరాలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లెటర్ లేదా ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.