తెలంగాణ

telangana

ETV Bharat / business

త్వరలో LIC నుంచి హెల్త్​ ఇన్సూరెన్స్ సేవలు! మరింత చౌకగా పాలసీలు! - LIC Health Insurance - LIC HEALTH INSURANCE

LIC Health Insurance : ఆరోగ్య బీమా సేవల్లోకి కూడా ఎంట్రీ ఇస్తామని ఎల్ఐసీ ఛైర్మన్ సిద్ధార్థ మొహంతి ప్రకటించారు. ఇందుకోసం ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరోగ్య బీమా కంపెనీలను కొనడం లేదా విలీనం చేసుకోవడం కానీ చేస్తామని వెల్లడించారు. దీనిపై అంతర్గతంగా కసరత్తును మొదలుపెట్టామని తెలిపారు.

LIC Health Insurance
LIC Health Insurance (GettyImages)

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 3:53 PM IST

LIC Health Insurance :దిగ్గజ ప్రభుత్వ రంగ జీవిత బీమా​ కంపెనీ ఎల్ఐసీ, ఆరోగ్య బీమా సేవల్లోకి కూడా ప్రవేశించే అవకాశం ఉందని ఆ సంస్థ ఛైర్మన్ సిద్ధార్థ మొహంతి ప్రకటించారు. ఒకవేళ ఆరోగ్య బీమా వ్యాపారంలోకి అడుగుపెట్టే అవకాశం లభిస్తే, ఇప్పటికే ఆ విభాగంలో సేవలందిస్తున్న కంపెనీలను ఎల్‌ఐసీలో విలీనం చేసుకోవడం లేదా కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతామని వెల్లడించారు. ఎల్‌ఐసీకి ఆరోగ్య బీమా సేవలు అందించే సత్తా కూడా ఉందని ఆయన తెలిపారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎల్‌ఐసీ ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తూ ఈ వివరాలను ఛైర్మన్ సిద్ధార్థ మొహంతి చెప్పారు. ఆరోగ్య బీమా సేవలు అందించేందుకు ఎల్‌ఐసీకి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఇప్పటికే అంతర్గతంగా కసరత్తును మొదలుపెట్టామని ఆయన పేర్కొన్నారు. తగిన భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకొని, బీమా సేవలను విస్తరించేందుకు తాము సంసిద్ధమై ఉన్నామన్నారు.

గత ఆర్థిక సంవత్సరం (2023-2024)లో తాము 2,04,28,937 పాలసీలను విక్రయించామని మొహంతి తెలిపారు. ఒక్కో ఎల్‌ఐసీ షేరుకు రూ.6 ఫైనల్ డివిడెెండ్‌గా చెల్లించాలని కంపెనీ బోర్డు తాజాగా సిఫార్సు చేసిందన్నారు. గతేడాది కూడా ఒక్కో షేరుపై రూ.4 మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించిన విషయాన్ని ఎల్‌ఐసీ ఛైర్మన్ గుర్తు చేశారు. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో ఎల్‌ఐసీ షేరుపై వాటాదారులకు రూ.10దాకా డివిడెండ్ లభించిందన్నారు.

కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ సిఫారసులు
జీవిత బీమా, సాధారణ బీమా, ఆరోగ్య బీమా అనే మూడు కేటగిరీలలో బీమా సంస్థలు ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి. ఒకే బీమా సంస్థ ఈ మూడు వ్యాపారాలను చేయడానికి అనుమతులిచ్చే నిబంధనలు ప్రస్తుతానికి బీమా చట్టం- 1938లో లేవు. ఒకే పాలసీతో సాధారణ బీమా, ఆరోగ్య బీమా, సాధారణ బీమాలను కవర్ చేసే పాలసీలను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) కూడా ఇప్పటిదాకా ఆమోదించలేదు.

అయితే ఈ విధానంలో మార్పు చేసే దిశగా యోచించాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. జీవిత బీమా, ఆరోగ్య బీమా, సాధారణ బీమాలను కలిపి మిశ్రమ బీమా పాలసీలను అందించేందుకు బీమా సంస్థలకు అనుమతించాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. బీమా కంపెనీలు మూడు రకాల బీమా సేవల్లోనూ పాల్గొనడం ద్వారా చౌకగా పాలసీలు లభిస్తాయని పార్లమెంటరీ కమిటీ తెలిపింది. దీనివల్ల ఆయా బీమా కంపెనీల ఆదాయ వనరులు కూడా పెరుగుతాయని చెప్పింది. ఈమేరకు బీమా చట్టంలో మార్పులు చేయాలని కమిటీ సూచించింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ పార్లమెంటరీ కమిటీ సిఫారసులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటే ఎల్ఐసీ కంపెనీ ఆరోగ్య బీమా వ్యాపారాన్ని మొదలుపెట్టేందుకు లైన్ క్లియర్ అవుతుంది.

ABOUT THE AUTHOR

...view details