Real Estate Investing Strategies :ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. అందరూ కొత్తకొత్త ఇళ్లను కొంటుంటే, దాదాపు 200 పాత ఇళ్లు, నిరుపయోగంగా వదిలేసిన ఇళ్లను కొన్నారు. వాటికి సాధ్యమైనంత తక్కువ ఖర్చులో మరమ్మతులు చేయించి, అద్దెలకు ఇచ్చి ప్రస్తుతం ఏటా రూ.8.2 కోట్ల దాకా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వ్యక్తిగతంగా పొదుపు చేసుకున్న డబ్బులు, బ్యాంకు రుణాలు, ఇళ్ల అద్దెల ద్వారా వచ్చిన ఆదాయంతోనే అద్దె ఇళ్ల వ్యాపార సామ్రాజ్యాన్ని హయతో కవమురా(Hayato Kawamura) నిర్మించుకున్నారు. 38 ఏళ్ల ఈ జపాన్ యువకుడి విజయగాథలోని విశేషాలను తెలుసుకుందాం.
జేబులో డబ్బులు లేకున్నా - ఇళ్ల ధరలపై ఆరా
హయతో కవమురా జపాన్‌లోని ఒసాకా నగర వాస్తవ్యులు. రియల్ ఎస్టేట్ పెట్టుబడి సూత్రాలకు పూర్తి భిన్నంగా ఆయన ముందుకు సాగారు. అయినా ఆకర్షణీయమైన ఫలితాలను సాధించారు. లాభాలను మూట కట్టుకున్నారు. వాస్తవానికి హయతో కవమురాకు స్థిరాస్తి కంటే ఆర్కిటెక్చర్ (భవన నిర్మాణం) అంటేనే ఎక్కువ ఆసక్తి. ఆయన సొంతూరిలో ఉన్నప్పుడు పర్వతంపైకి ఎక్కి, ఊరిలోని ఏ భవనం నిర్మాణ స్వరూపం ఎలా భిన్నంగా ఉందనేది నిశితంగా పరిశీలిస్తూ కూర్చునేవారు. ఈ ఆసక్తే కాలక్రమంలో ఆయనను స్థిరాస్తి రంగం వైపుగా నడిపించింది. చివరకు గర్ల్ ఫ్రెండ్‌తో డేటింగ్‌లో ఉన్న సమయంలోనూ హయతో కవమురా పాత ఇళ్లు, నిరుపయోగంగా వదిలేసిన ఇళ్లను పరిశీలిస్తుండేవారు. తన జేబులో డబ్బులు లేకున్నా, ఆ ఇళ్ల ధరల గురించి ఆరా తీస్తుండేవారు.
డిమోషన్ ఎఫెక్ట్
అప్పటివరకు హయతో కవమురా చిన్నపాటి ఉద్యోగం చేసేవారు. ఆ కంపెనీలో హయతోకు బాస్‌గా వ్యవహరించే ఒక వ్యక్తికి డిమోషన్ ఇచ్చారు. సీనియర్‌తో విబేధాల వల్లే తన బాస్‌కు డిమోషన్ ఇచ్చారని తెలుసుకొని హయతో చాలా బాధపడ్డాడు. "ఉద్యోగి సామర్థ్యం కంటే, సీనియర్ల మెప్పు ఉన్న వాళ్లకే ప్రమోషన్లు ఇస్తున్నారని నేను ఆ సమయంలో గ్రహించాను. ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించాలని నిర్ణయించుకున్నాను. వేతనంతో సంబంధం లేకుండా జీవించే స్థాయికి ఎదగాలని నిర్దేశించుకున్నాను" అని నాటి పరిస్థితిని హయతో గుర్తు చేసుకున్నారు.