Indian Budget Interesting Facts :భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈసందర్భంగా గతంలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లతో ముడిపడిన ఆసక్తికర విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. బ్లాక్ బడ్జెట్, దేశపు తొలి బడ్జెట్, పేపర్ లెస్ బడ్జెట్ సహా పలు రకాల బడ్జెట్‌లపై ఇందులో సమాచారం అందుబాటులో ఉంది.
బ్లాక్ బడ్జెట్ ఇదిగో
దేశపు తొలి బ్లాక్ బడ్జెట్‌ను మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో 1973 సంవత్సరం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రిగా యశ్వంత్‌రావు చవాన్ ఉన్నారు. ఈ బడ్జెట్‌కే 'బ్లాక్ బడ్జెట్' అనే పేరు వచ్చింది. ఎందుకంటే ఆ బడ్జెట్‌లో ద్రవ్యలోటు ఏకంగా రూ.550 కోట్లు. ఆందోళనకర స్థాయిలో ద్రవ్యలోటును చూపించడం వల్ల దీనికి బ్లాక్ బడ్జెట్ అనే పేరొచ్చింది. 1971లో భారత్-పాక్ యుద్ధం, బంగ్లాదేశ్ ఏర్పాటు తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ డీలా పడింది. దేశంలోని జనరల్ బీమా కంపెనీలు, బొగ్గు గనులను ప్రభుత్వపరం చేసే ప్రతిపాదన ఈ బడ్జెట్‌లో కీలకమైంది. ద్రవ్యోల్బణానికి ఎదురీది నిధుల లోటును పూడ్చుకోవడానికి ఇలాంటి ప్రతిపాదనలు చేశారు. దేశానికి ఆర్థిక అత్యవసరాలు ఏర్పడ్డాయనే అంశాన్ని ప్రతిబింబించేందుకే బ్లాక్ బడ్జెట్ అనే పదాన్ని వినియోగించారు.
భారత బడ్జెట్ గురించి 10 ఆసక్తికర విషయాలు
బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ ఆర్థిక వ్యూహాలను వివరించే ముఖ్యమైన పత్రం. 1992 నాటికి భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న డాక్టర్ మన్మోహన్‌సింగ్ దేశ భవిష్యత్తును మార్చే ఒక సంచలనాత్మక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
1. మొదటి బడ్జెట్
స్వతంత్ర భారతదేశపు మొదటి వార్షిక బడ్జెట్‌ను 1948 ఫిబ్రవరి 28న ఆర్‌కే షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రానంతరం దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి 1947 నవంబర్ 26న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది జరిగిన మూడు నెలల తర్వాత పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
2. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానులు
భారతదేశ చరిత్రలో కేవలం ముగ్గురు ప్రధానులు మాత్రమే కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1958లో జవహర్‌లాల్ నెహ్రూ, 1970లో ఇందిరా గాంధీ, 1987లో రాజీవ్ గాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. క్లిష్ట సమయాల్లో భారతదేశ ఆర్థిక విధానాలను రూపొందించడంలో ప్రధానులు పోషించిన ముఖ్యమైన పాత్రను ఈ అంశం ప్రతిబింబిస్తోంది.
3. పెద్ద, చిన్న బడ్జెట్ ప్రసంగాలు
అతిపెద్ద కేంద్ర బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరిట ఉంది. ఆమె 2020 సంవత్సరంలో 2 గంటల 42 నిమిషాల పాటు కేంద్ర బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇక 1977లో నాటి కేంద్ర ఆర్థికమంత్రి హిరూభాయ్ పటేల్ 800 పదాలతో అతి చిన్న బడ్జెట్ ప్రసంగం చేశారు.
4. పేపర్‌లెస్ బడ్జెట్
మన దేశ చరిత్రలో తొలిసారిగా 2021లో పేపర్ లెస్ మోడ్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ కార్యకలాపాలలో పేపర్ వినియోగాన్ని తగ్గించడమే దీని లక్ష్యం.