Income Tax Vs TDS :భారతదేశంలోని పన్ను చెల్లింపుదారులు తరచూ ఇన్‌కం ట్యాక్స్, టీడీఎస్ (ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) గురించి వింటూ ఉంటారు. ఇవి వినడానికి ఒకేలా ఉంటాయి కానీ, వీటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఒక వ్యక్తి సంపాదించిన మొత్తం వార్షిక రాబడిపై కట్టే పన్నునే 'ఇన్‌కం టాక్స్' అంటారు. యజమాని లేదా కంపెనీ తమ ఉద్యోగికి చేసిన చెల్లింపులపై విధించే పన్నునే 'టీడీఎస్' అని అంటారు. ఈ రెండు పన్నుల వసూలు ప్రక్రియ కూడా భిన్నంగా ఉంటుంది.
ఆదాయ పన్ను
What Is Income Tax :
- ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి లేదా సంస్థ ఆర్జించిన మొత్తం ఆదాయంపై విధించే పన్నునే 'ఇన్‌కం ట్యాక్స్' అంటారు. 1961 ఆదాయ పన్ను చట్టం ఆధారంగా ఈ ట్యాక్స్‌ను వసూలు చేస్తారు. ఈ చట్టంలో పన్ను గణన, అంచనా, వసూళ్లకు సంబంధించిన నిబంధనలు ఉంటాయి. ఒక వ్యక్తికి వచ్చే జీతం, ఇళ్లు లేదా ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం, వృత్తి లేదా వ్యాపారం వల్ల వచ్చే లాభాలు, మూలధన రాబడులు మొదలైన వాటిన్నింటిపై మనం ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- పాత పన్ను విధానం ప్రకారం, ఒక వ్యక్తి ఏడాదిలో రూ.2.5 లక్షలకు మించి సంపాదిస్తే, అతను ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లించాలి.
- 60 ఏళ్ల నుంచి 80 ఏళ్లలోపు వయస్సున్న సీనియర్ సిటిజన్లు ఏడాదికి రూ.3 లక్షలకు మించి సంపాదిస్తూ ఉంటే, వాళ్లు కూడా ఇన్‌కం టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
- 80 ఏళ్లు కంటే ఎక్కువ వయస్సున్న వయోవృద్ధులు ఏడాదికి రూ.5 లక్షలకన్నా ఎక్కువ సంపాదిస్తూ ఉంటే, అప్పుడు వాళ్లు కూడా ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- కొత్త పన్ను విధానం ప్రకారం, ఒక వ్యక్తి ఏడాదిలో రూ.3 లక్షలకు మించి సంపాదిస్తే, అతను ప్రభుత్వానికి ఇన్‌కం ట్యాక్స్ కట్టాలి. అయితే సెక్షన్ 87ఏ కింద రాయితీ (రిబేట్) పెరిగింది. అందువల్ల ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలకు మించకుండా రాబడి సంపాదిస్తే, ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒక వేళ కావాలనే పన్ను కట్టకుండా ఎగవేస్తే, చట్టం ప్రకారం అది శిక్షార్హం అవుతుంది.
టీడీఎస్
What Is TDS :
- యజమాని లేదా కంపెనీ ఒక వ్యక్తికి చేసిన చెల్లింపులపై విధించే పన్నును టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) అంటారు. జీతాలు, పెట్టుబడులు, అద్దె చెల్లింపులు, బ్రోకరేజీ, కమీషన్, ప్రొఫెషనల్ ఫీజులు లాంటి పేమెంట్స్ అన్నింటిపైనా ఈ టీడీఎస్ వర్తిస్తుంది.
- యజమానులు లేదా సంస్థలు ఈ పన్నును నేరుగా ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుంది. పన్ను ఎగవేతను నిరోధించడం కోసం, పన్ను వసూలు ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఈ విధానాన్ని అనుసరిస్తారు.
- జాతీయ పొదుపు పథకం (నేషనల్ సేవింగ్స్ స్కీమ్) సహా అనేక ఇతర వనరులకు సంబంధించిన చెల్లింపులపైనా టీడీఎస్ కట్ అవుతుంది.
- పోటీలు, లాటరీలు, జూదం, ప్రైజ్ మనీ, రీడెల్స్ లాంటి కార్యకలాపాల ద్వారా సంపాదించిన సొమ్ముపై కూడా టీడీఎస్ కట్ అవుతుంది.