తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? జూన్ 15 వరకు వెయిట్ చేయడం బెటర్ - ఎందుకో తెలుసా? - Income Tax Return Filing - INCOME TAX RETURN FILING

Income Tax Return Filing : 2023-24 ఏడాదికి సంబంధించిన ఐటీ రిటర్నులు ఫైల్​ చేయడానికి సిద్ధమవుతున్నారా? అయితే ఇది మీ కోసమే. జూన్ 15 వరకు ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకో తెలుసా?

ITR Filing
Income Tax Return Filing (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 11:40 AM IST

Income Tax Return Filing :ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు చాలా మంది గాబరా పడిపోతుంటారు. మొదటి రోజు నుంచే ఈ-ఫైలింగ్‌ పోర్టల్​లోఐటీ రిటర్నులు దాఖలు చేసేస్తుంటారు. నిర్ణీత గడువులోగా ఐటీ రిటర్నులు దాఖలు చేయడం మంచిదైనా, మరీ అంత వేగంగా రిటర్నులు ఫైల్ చేయొద్దంటున్నారు నిపుణులు. జూన్ 15 వరకు వేచి చూసి ఐటీ రిటర్నులు దాఖలు చేయమంటున్నారు. నిపుణులు ఎందుకు అలా అంటున్నారో తెలుసా?

గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) సంబంధించిన రిటర్నుల ఫైలింగ్‌ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. జులై 31 ఆఖరి తేదీ. ఈ నేపథ్యంలో ఐటీఆర్ 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 3, ఐటీఆర్ 4, ఐటీఆర్ 5, ఐటీఆర్ 6 ఫారాలను ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్‌ పోర్టల్​లో అందుబాటులో ఉంచింది. అయితే ఉద్యోగులు మాత్రం జూన్ 15లోపు ఐటీఆర్ దాఖలు చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఐటీఆర్ ఫైలింగ్ చేసేటప్పుడు, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం, తగ్గింపులు, మినహాయింపులు అన్నీ తెలపాల్సి ఉంటుంది. అంటే ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఏప్రిల్ 1- మార్చి 31 వరకు జరిపిన మీ అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మునుపటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలు, పత్రాలు అన్నీ ఏప్రిల్ నాటికి అందుబాటులోకి ఉండకపోవచ్చు.

ఫారం-16
ఆదాయపు ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఉద్యోగులు వార్షిక‌ ఆదాయ పన్ను రిట‌ర్నులుదాఖ‌లు చేసేందుకు ఫారం 16 కీల‌క‌మైన ప‌త్రం. ఉద్యోగి తాను ప‌నిచేస్తున్న సంస్థ నుంచి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఫారం 16 అనేది ప్రాథ‌మికంగా ఇచ్చే టీడీఎస్ (మూలం వ‌ద్ద ప‌న్ను) స‌ర్టిఫికెట్‌. సాధార‌ణంగా ఉద్యోగి జీతం నుంచి టీడీఎస్ క‌ట్ చేసిన‌ప్పుడు య‌జ‌మాన్యం ఫారం 16ని అందిస్తుంది. సంస్థ యాజ‌మాన్యం త‌మ ఉద్యోగి ఆర్థిక సంవ‌త్స‌రంలో సంపాదించిన‌ ఆదాయం, పొందిన మిన‌హాయింపులు, టీడీఎస్ వివ‌రాల‌తో ఫారం 16ని జారీ చేస్తుంది. కాగా, చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ప్రతి ఏడాది జూన్ 15 తరువాతనే ఫారం 16ను అందజేస్తుంటాయి. మరికొన్ని సంస్థలు మరింత ఆలస్యంగా ఫారం 16ను అందిస్తాయి.

ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఫారం 16 ఒక్కటే కాకుండా మరికొన్ని పత్రాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నెలవారీ జీతానికి సంబంధించిన రశీదులు, అన్ని అలవెన్సులు, ఫారం 26ఏఎస్, పన్ను మినహాయింపునకు సంబంధించిన అన్ని పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. మీరు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ పొందుతున్నట్లయితే పొదుపు ఖాతా వడ్డీకి సంబంధించిన బ్యాంక్ స్టేట్​మెంట్‌, ఫిక్స్​డ్‌ డిపాజిట్లపై వడ్డీ, టీడీఎస్ సర్టిఫికెట్లను బ్యాంక్ నుంచి తీసుకోవాలి. ఈ పత్రాలను బ్యాంకులు కొన్ని సార్లు ఏప్రిల్ లేదా మే చివరి నాటికి ఇస్తాయి. అందువల్ల ఎవరైనా ఏప్రిల్​లో ఐటీఆర్​ను ఫైల్ చేస్తే, వారు తమ రిటర్న్ ఫైలింగ్​లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల వివరాలను మాత్రమే అందజేసే అవకాశం ఉంది. అందుకే జూన్ 15 వరకు ఆగడం మంచిది. అప్పుడే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80టీటీఏ కింద బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై కూడా పన్ను మినహాయింపు పొందొచ్చు.

ఫారం- 26ఏఎస్ అంటే ఏమిటి?
ఫారం-26 ఏఎస్ ప్రాథమికంగా టీడీఎస్, టీసీఎస్ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఇది పన్ను క్రెడిట్​ను సులభంగా క్లెయిమ్ చేసుకునేందుకు సాయపడుతుంది. కనుక ఈ పత్రాలు అన్నీ సిద్ధం చేసుకున్నాకే, ఐటీఆర్ ఫైల్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

వరల్డ్ సూపర్​ రిచ్ క్లబ్​లో 15 మంది - జాబితాలో అంబానీ, అదానీ - World Super Rich Club

కొత్తగా ఉద్యోగంలో చేరారా? ఈ 6 హక్కుల గురించి తెలుసుకోవడం మస్ట్! - Employee Basic Rights

ABOUT THE AUTHOR

...view details