How To Transfer Car Insurance Policy To family Member : మన దేశంలో వాహనాలకు ఇన్సూరెన్స్ చేయడం తప్పనిసరి. వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు, దొంగతనం జరిగినప్పుడు ఈ ఇన్సూరెన్స్ రక్షణ కల్పిస్తుంది. అయితే కొంతమంది తమ పేరు మీద ఉన్న కారు ఇన్సూరెన్స్‌ను కుటుంబ సభ్యుల పేరు మీదకు మార్చాలని భావిస్తుంటారు. అసలు ఇది సాధ్యమా? దీనితో ముడిపడి ఉన్న అంశాలు ఏంటి? అనే విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాహన బీమా అనేది పూర్తిగా కారు యజమానికి లేదా నడిపే వ్యక్తులకు సంబంధించినది. వాస్తవానికి కార్ ఇన్సూరెన్స్‌ను మరొకరి పేరు మీదకు బదిలీ చేయడానికి వీలవుతుంది. అయితే ఇది బీమా కంపెనీ మీద, మీరు ఉంటున్న ప్రాంతం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ ట్రాన్స్ఫర్ విషయంలో చాలా నిబంధనలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలసీ నిబంధనలు, షరతులు :ఇన్సూరెన్స్ జారీ సమయంలో బీమా కంపెనీలు చాలా షరతులు, నిబంధనలను విధిస్తాయి. అందులో పాలసీ బదిలీకి అనుమతించవచ్చు లేదా అనుమతించకపోవచ్చు. ఆయా బీమా కంపెనీలను బట్టి ఇది మారుతూ ఉంటుంది.
కార్ ఓనర్ షిప్ :కార్ ఇన్సూరెన్స్ అనేది కార్ ఓనర్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబ సభ్యుడికి కానుకగా ఇవ్వడం, లేదంటే కుటుంబ సభ్యుడికి బదిలీ చేసే సమయంలో సదరు డాక్యుమెంట్ల ప్రకారం, కార్ ఓనర్‌షిప్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.
డ్రైవర్ సమాచారం :కార్ ఇన్సూరెన్స్ అనేది కారును నడిపేవారి డ్రైవింగ్ చరిత్ర, వ్యక్తిగత సమాచారం మీద ఆధారపడి ఉంటాయి. కొన్నిసార్లు కార్ ఇన్సూరెన్స్‌ను బదిలీ చేసినప్పుడు డ్రైవింగ్ చరిత్ర, వ్యక్తిగత సమాచారం వల్ల ప్రీమియం రేట్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి.
కవరేజ్ :ఏ పాలసీనైనా మీ అవసరాలకు అనుగుణంగా తీసుకోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్ అలవాట్లు, ప్రాధాన్యాల ఆధారంగా అదనపు కవరేజ్ ఉండేలా జాగ్రత్తపడాల్సి ఉంటుంది.