How Much Cash Can Legally Keep At Home In India :భారత దేశంలో చాలా మంది తాము సంపాదించిన డబ్బును ఇంట్లోనే భద్రంగా దాచుకుంటూ ఉంటారు. మరి ఇలా ఎంత మొత్తం వరకు ఇంట్లో డబ్బులు దాచుకోవచ్చు? పరిమితి మించి డబ్బులు ఉంటే ఏం చేయాలి? అనే అనుమానాలు మీకెప్పుడైనా వచ్చాయా?
ఎలాంటి పరిమితులు లేవు
మీరు సంపాదించిన డబ్బును మీ ఇంట్లోనే నగదు రూపంలో దాచుకోవచ్చు. దీనిపై ఎలాంటి పరిమితిలు లేవు. ఆదాయ పన్ను (Income Tax) నిబంధనల ప్రకారం, మీరు మీ ఇంట్లో ఎంత మొత్తంలోనైనా నగదును నిల్వ చేసుకోవచ్చు. కానీ, ఆదాయపన్ను శాఖవారు విచారణ చేసినప్పుడు, ఆ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చిందో కచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. దర్యాప్తు చేసే అధికారికి ఆ డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అంతా సక్రమంగా ఉంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక వేళ మీరు సరైన పత్రాలు చూపించకపోతే, భారీగా జరిమానా విధించవచ్చు. అరెస్టు కూడా చేయవచ్చు.
లెక్కల్లోకి రాని నగదును ఎం చేస్తారు?
ఆదాయ పన్ను అధికారులు అప్పుడప్పుడు ఐటీ రైడ్స్ చేస్తుంటారు. ఈ ఐటీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న డబ్బులకు, మీరు సరైన లెక్కలు చెప్పలేకపోతే, అప్పుడు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదాయానికి సంబంధించి సరైన వివరాలు అందించనప్పుడు, భారీగా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అరెస్ట్ కూడా చేసే అవకాశముంది. ముఖ్యంగా ఆదాయ వివరాలు చెప్పని డబ్బుపై 78 శాతం వరకు పన్ను విధిస్తారు. దీనికి అదనంగా పెనాల్టీ కూడా వసూలు చేస్తారు. అందుకే మీకు వచ్చిన ఆదాయ వివరాలను తెలుపుతూ ఐటీఆర్ దాఖలు చేయాలి. అలాగే సరైన అకౌంట్ బుక్స్ మెయింటైన్ చేయాలి.