Financial Deadlines In March 2024 : మీరు సుకన్య సమృద్ధి యోజన (SSY), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకాల్లో మదుపు చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ ఏడాది మార్చి 31లోపు ఈ పథకాల్లో కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. లేదంటే సదరు ఖాతాలు స్తంభించిపోతాయి. తరువాత ఆ అకౌంట్లు పునరుద్ధరణ చేసుకోవాలంటే, జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. పైగా పలు ప్రయోజనాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది.
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ 'అమృత్ కలశ్' పేరుతో స్పెషల్ ఎఫ్డీ స్కీమ్‌ను అందిస్తోంది. దీనిలో చేరడానికి చివరి తేదీ ఈ మార్చి 31. కనుక ఆసక్తి ఉన్నవారు వీలైనంత త్వరగా ఈ అమృత్ కలశ్ స్కీమ్‌లో చేరడం మంచిది.
Public Provident Fund :పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో ప్రతి సంవత్సరం కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు జమ చేయవచ్చు. ఒకవేళ గడువులోగా కనీస మొత్తం జమ చేయకపోతే ఖాతా స్తంభించిపోతుంది. తిరిగి ఖాతా పునరుద్ధరణ చేయాలంటే, రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
సాధారణంగా పీపీఎఫ్ అకౌంట్ తెరిచిన మూడో సంవత్సరం నుంచి రుణం తీసుకోవచ్చు. ఆరో సంవత్సరం నుంచి నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. ఒక వేళ అకౌంట్ స్తంభించిపోతే ఈ లోన్, విత్‌డ్రా సదుపాయాలను కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ స్తంభించిన పీపీఎఫ్ ఖాతాను పునరుద్ధరించాలంటే, జరిమానా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.550 చొప్పున చెల్లించాల్సి వస్తుంది.
Sukanya Samriddhi Yojana : కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకమేసుకన్య సమృద్ధి యోజన. ఈ పథకంలో ఏటా కనిష్ఠంగా రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. కనీస మొత్తం జమ చేయకపోతే అకౌంట్ స్తంభించిపోతుంది. మళ్లీ రూ.50 జరిమానా చెల్లించి ఖాతాను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. అంటే కనీస డిపాజిట్ మొత్తం + జరిమానా రూ.50 కలిపి చెల్లించాల్సి వస్తుంది. ఏదైనా కారణంతో ఖాతాను పునరుద్ధరించకపోతే, ఖాతాలోని మొత్తం డబ్బు మెచ్యూరిటీ తరువాత మాత్రమే తీసుకోవడానికి వీలవుతుంది. ఎస్‌ఎస్‌వై ఖాతా తెరిచిన 21 ఏళ్ల తర్వాత లేదా అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తరువాత ఈ అకౌంట్ మెచ్యూర్ అవుతుంది.
Amrith Kalash Scheme Deadline : మనదేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తమ కస్టమర్ల కోసం 'అమృత్ కలశ్' పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకంలో చేరడానికి ఆఖరు తేదీ 2024 మార్చి 31.