ISRO Cowpea Sprouts First Leaves in Space: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన రోదసి సేద్యంలో భాగంగా అలసంద (బొబ్బర్లు) విత్తనాలు ఆకులను తొడిగాయి. ఈ మేరకు అంతరిక్షంలోకి పంపిన అలసంద విత్తలనాల నుంచి తొలిసారిగా లేలేత ఆకులు పుట్టుకొచ్చాయని ఇస్రో ప్రకటించింది. ఇది రోదసిలో మొక్కల సాగును చేపట్టగల తమ సత్తాకు నిదర్శనమని పేర్కొంది.
కాగా అంతరిక్షంలో ఆహారాన్ని పండించే విధానాలపై పరిశోధనల కోసం ఇస్రో.. కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ (CROPS) అనే ప్రయోగాన్ని చేపట్టింది. దీన్ని గత నెల 30న ప్రయోగించిన PSLV-C60 రాకెట్‌లోని నాలుగో దశ (POEM-4)లో అమర్చింది. ఇందులో 8 అలసంద విత్తనాలను పంపించగా అవి జీరో గ్రావిటీలో నాలుగు రోజుల్లోనే మొలకెత్తాయి. ఇప్పుడు ఇవి ఆకులు తొడిగాయి.
ఏంటీ క్రాప్స్ ప్రయోగం?: రోదసిలో మొక్కలను పెంచడంలో, వాటి స్థిరమైన మనుగడలో ISRO సామర్థ్యాన్ని పెంచేందుకు CROPSను మల్టీ-స్టేజ్ ల్యాబ్‌గా రూపొందించారు. దీన్ని బోర్డ్‌లో ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్‌గా డిజైన్ చేశారు. ఇందులో అలసంద విత్తనాలను పంపించి జీరో గ్రావిటీ వాతావరణంలో 5 నుంచి 7 రోజుల పాటు ఈ ప్రయోగాన్ని చేపట్టాలని ఇస్రో భావించింది.
ఇందుకోసం స్పేస్‌క్రాఫ్ట్ లోపల ఈ విత్తనాలను యాక్టివ్ టెంపరేచర్ కంట్రోల్‌తో క్లోజ్డ్ బాక్స్ వాతావరణంలో ఉంచారు. ఇందులో కెమెరా ఇమేజింగ్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ కాన్సంట్రేట్స్, సాపేక్ష ఆర్ద్రత (RH), ఉష్ణోగ్రత, నేల తేమ వంటి మొక్కల పెరుగుదల, దాని పర్యవేక్షణ కోసం తగిన వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రయోగం చేపట్టిన 4 రోజుల్లోనే అవి సూక్ష్మ గురుత్వాకర్షణలో మొలకెత్తడంతో ఇస్రో హర్షం వ్యక్తం చేసింది. తాజాగా ఇవి ఆకులను కూడా తొడిగాయి.
Leaves have emerged! 🌱 VSSC's CROPS (Compact Research Module for Orbital Plant Studies) aboard PSLV-C60 POEM-4 achieves a milestone as cowpea sprouts unveil their first leaves in space. 🚀 #ISRO #BiologyInSpace #POEM4 pic.twitter.com/xKWmGHoPfl
— ISRO (@isro) January 6, 2025
ఈ ప్రయోగం ఎందుకు?: ఈ క్రాప్స్ ప్రయోగం అంతరిక్షంలోని వివిధ వాతావరణాలలో మొక్కలు ఎలా పెరుగుతాయో తెలుసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. జీరో గ్రావిటీలో మొక్కల పెరుగుదలను అధ్యయనం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు తమ ఆహారాన్ని అక్కడే సాగు చేసుకునేందుకు వీలుపడుతుంది.
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో లాంగ్- టెర్మ్ స్పేస్ ప్రాజెక్ట్‌ల కోసం దీన్ని తెలుసుకోవడం చాలా అవసరం. ఈ తరహా వ్యవస్థల ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు, గాలి, నీరును అందించడానికి వీలవుతుందని ఇస్రో తెలిపింది. ఇప్పుడు ఈ క్రాప్స్ ప్రయోగం విజవంతం కావడంతో గగన్‌యాన్, స్పేస్ స్టేషన్ వంటి భవిష్యత్తులో ముఖ్యమైన ప్రాజెక్టుల కోసం రోదసిలో మానవులను సుదీర్ఘకాలం ఉంచే దిశగా ఇది ముందడుగు అవుతుందని పేర్కొంది.
ఇదిలా ఉండగా ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ వాయిదా పడింది. ఇస్రో ముందస్తు ప్రణాళిక ప్రకారం.. ఈ డాకింగ్ ప్రక్రియ జనవరి 7న అంటే ఇవాళ జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ మిషన్‌లో డాకింగ్ షెడ్యూల్‌ను మార్చుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇందుకు కారణం ఏంటి? రీషెడ్యూల్ ఎప్పుడు? వంటి వివరాలతో పాటు ఈ మిషన్‌పై ఓ అవగాహన కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇస్రో స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ వాయిదా- కారణం ఏంటంటే?
సాంకేతికతలో విప్లవ మార్పులు- అంతరిక్షంలో 'పురుడు' పోసుకున్న జీవం!- ఇస్రో మరో ఘనత
సూర్యుని చెంతకు మానవ అస్త్రం- చరిత్ర సృష్టించిన 'పార్కర్ సోలార్ ప్రోబ్'