Telangana Government Filed A Caveat Petition In The Supreme Court : ఫార్మూలా-ఈ రేసు వ్యవహారం సుప్రీంకోర్టు వద్దకు చేరింది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు ఇవాళ కొట్టివేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లానున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ కేసులో ముందుగానే కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ ఒకవేళ పిటిషన్ వేస్తే తమ వాదనలూ వినాలని ప్రభుత్వం అందులో కోరింది.
ఫార్మూలా-ఈ రేసులో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దంటూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల గడువు కూడా ముగిసింది. హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన తరుణంగా ఏసీబీ అధికారులు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.
ఇప్పటికే ఏసీబీ అధికారులు పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించొచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ ముందస్తు బెయిల్ కోసమైనా, లేకపోతే హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళితే, ప్రభుత్వం తరఫున వాదనలు విన్న తర్వాతే సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేయనుంది.
లీగల్ టీమ్‌తో కేటీఆర్ : హైకోర్టు తన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన నేపథ్యంలో కేటీఆర్, గులాబీ నేతలు భవిష్యత్ వ్యూహరచనలో పడ్డారు. లీగల్ టీమ్తోనూ కేటీఆర్ సంప్రదింపులు జరిపారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలా, వద్దా అనే అంశంపై వారితో చర్చించినట్లు సమాచారం. ఈ కేసులో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తప్పు చేసినట్లు నిరూపిస్తే ఆబిడ్స్ చౌరస్తాలో ఉరి వేసుకోవచ్చని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పు అనంతరం తనను కలిసిన నేతలతో సమావేశమైన ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.
అన్నింటికి సిద్ధంగానే ఉన్నా : ఫార్ములా - ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలను తాను పలుమార్లు స్పష్టంగా చెప్పానని తప్పిదాలు ప్రశ్నిస్తున్నందుకే ప్రభుత్వం కక్ష గట్టి అక్రమ కేసు పెట్టిందని నేతలకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక దృష్టి మరల్చే ప్రయత్నంలో భాగంగా అక్రమ కేసులు పెడుతోందని, జరగబోయే అన్నింటికీ సిద్ధంగానే ఉన్నానని కేటీఆర్ నేతలతో అన్నట్లు తెలిసింది. ప్రజల పక్షాన పోరాడాలని, కాంగ్రెస్ గ్యారంటీలు, హామీల అమలు పైనే దృష్టి సారించాలని చెప్పారు.
కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - క్వాష్ పిటిషన్ కొట్టివేత