Economic Survey 2023-24 : దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసే 'ఆర్థిక సర్వే 2023-24'ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సర్వేను రూపొందించారు. బడ్జెట్‌లో 'ఈజ్ ఆఫ్ డూయిండ్ బిజినెస్'పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు ఆమె చెప్పారు. మంగళవారం జరగబోయే పార్లమెంట్ సమావేశంలో కేంద్రమంత్రి పూర్తి స్థాయి బడ్జెట్ 2024-25ను ప్రకటిస్తారు.
బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనమిక్ సర్వే. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్‌లోని ఎకనమిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది. తొలుత 1950-51 సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్‌తో పాటే ప్రవేశపెట్టేవారు. 1960 తర్వాత బడ్జెట్‌కు ఒక రోజు ముందు ప్రవేశపెట్టే సంప్రదాయం మొదలైంది.
వృద్ధి దిశగా భారత్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2024-25 ఆర్థిక సంవత్సారానికిగాను దేశ వాస్తవ జీడీపీ 6.5-7 శాతం వరకు వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం, 2024-25లో భారత దేశ ఆర్థిక వృద్ధి 8.2 శాతంగా ఉంటుందని ఉంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ 2025 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును 7.2 శాతంగా అంచనా వేసింది. ఐఎంఎఫ్, ఏడీబీ వంటి గ్లోబల్ ఏజెన్సీలు భారతదేశం 7 శాతం వృద్ధి సాధించవచ్చని పేర్కొన్నాయి. కానీ ఆర్థిక సర్వే 2023-24 మాత్రం వీటన్నింటికంటే చాలా తక్కువగా, కేవలం 6.5-7 శాతమే వృద్ధి ఉంటుందని అంచనా వేసింది.
బడ్జెట్ 2024-25లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. దాదాపు 11 దశల్లో దీనిపై చర్చలు జరిగాయని పేర్కొన్నారు. ముఖ్యంగా 63 నేరాలను డీక్రిమినైజేషన్ చేయడం వల్ల ప్రస్తుతం కంపెనీలు సమర్థంగా కొనసాగుతున్నాయని ఆమె అన్నారు.
గర్వకారణం
ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక సర్వే విడుదలకు ముందు మాట్లాడుతూ, 'భారత రాజకీయాల్లో 60 ఏళ్ల తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం చాలా గర్వించదగ్గ విషయం అని అన్నారు. దేశంలోని ప్రజలకు, ప్రభుత్వం లక్ష్యంగా ఏర్పరుచుకున్న 'అమృత్‌కాల్'కు ఈ బడ్జెట్ కీలకంగా మారనుందని తెలిపారు. ఈ బడ్జెట్ ప్రభుత్వం కలలుకనే 'వికసిత్ భారత్'కు పునాది వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆర్థిక సర్వే 2023-24 హైలెట్స్
- ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితితో ఉన్నప్పటికీ, 2024 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఆర్థిక వృద్ధి బాగానే ఉంటుంది.
- భారత ఆర్థిక రంగాలు మంచి వృద్ధి పథంలో పయనించే అవకాశం ఉంది.
- అంతర్జాతీయ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, ఆర్బీఐ మోనటరీ పాలసీని ప్రభావితం చేయవచ్చు.
- ఈ ఏడాది వర్షపాతం, అంతర్జాతీయంగా ఆహార పంటల ధరలు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. కనుక ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.
- ప్రభుత్వ అవలంభిస్తున్న ధరల స్థిరీకరణ విధానాల వల్ల కూడా ద్రవ్యోల్బణం అదుపులో ఉండే అవకాశం ఉంది.
- కార్పొరేట్, బ్యాంక్ బ్యాలెన్స్‌లు మంచి ఆరోగ్యవంతమైన స్థితిలో ఉన్నాయి. కనుక ప్రైవేట్ పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది.
- పన్నుల రాబడి, వ్యయ నియంత్రణ, డిజిటలైజేషన్లు భారత ఆర్థిక చక్కటి సమతుల్యతలో ఉండడానికి సాయపడతాయి.
- భారత ఆర్థిక వృద్ధికి క్యాపిటల్ మార్కెట్లు మూల స్తంభాలుగా ఉంటాయి.
- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వివిధ రంగాల్లోని ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో చెప్పలేని అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి.
- చైనా నుంచి భారతదేశంలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరుగుతున్నాయి. కనుక భారత్ ఎగుమతులు పెరిగే ఛాన్స్ ఉంది. దీని వల్ల గ్లోబల్ సప్లై చెయిన్‌లో భారత్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.
- భారతదేశంలో 54 శాతం రోగాలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లనే వస్తున్నాయి. అందువల్ల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రజలు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది.
- 2024లో భారత్‌కు రెమిటెన్స్‌లు 3.7% పెరిగి 124 బిలియన్ డాలర్లకు పెరుగుతాయి. 2025లో 4% పెరిగి 129 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని ఆర్థిక సర్వే తెలిపింది.
- 2022-23 నాటికి నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గింది. అంటే దేశంలో నిరుద్యోగిత తగ్గుముఖం పట్టింది!
- ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం వల్ల రూ.67,690 కోట్ల మేరకు పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో రూ.14,000 కోట్లు కార్యరూపం దాల్చాయి.
రుణం చెల్లించినా క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందా? కారణం ఇదే! - Credit Score Drop
లోన్ రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారా? అయితే ఇలా చేయండి - మీ జోలికి అస్సలు రారు! - Loan Recovery Agents Harassment