Israel Killed Top Hamas Commander : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య పోరు క్రమంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో హమాస్ జరిపిన అక్టోబరు 7 నాటి దాడుల కీలక సూత్రధారిని తాము హతమార్చామని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) తాజాగా ప్రకటించింది.
'అక్టోబరు 7 దాడుల వెనుకున్న కీలక సూత్రధారి, హమాస్ టాప్ కమాండర్ అయిన అబ్దల్ హదీ సబాను హతమార్చాం. సబా అనేక ఉగ్రవాద దాడులకు నాయకత్వం వహించాడు. ఆ నాటి దాడులకు కారకులైన మిగతా వారిని కూడా హతమార్చే వరకు మా ఆపరేషన్‌ను కొనసాగిస్తాం' అని ఐడీఎఫ్ తెలిపింది.
అరౌరీని హతమార్చింది కూడా మేమే!
మరోవైపు గతేడాది జనవరిలో హమాస్ నాయకుడు సలేహ్ అరౌరీని తామే హతమార్చామని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. లెబనాన్‌పై జరిగిన దాడుల్లో హమాస్ డిప్యూటీ పొలిటికల్ హెడ్, మిలిటెంట్ వింగ్ వ్యవస్థాపకుడు అరౌరీతో సహా మరో ఐదుగురు హతమయ్యారు.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ తీవ్రమైన దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 1,200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు హమాస్ 251 మందిని బంధించి గాజాకి తీసుకెళ్లింది. మధ్యలో తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొందరు బందీలు విడుదల చేసింది. కానీ ఇంకా 97 మంది హమాస్ చెరలోనే ఉండిపోయారు. అయితే ఆ తరువాత జరిగిన పలు ఘటనల్లో మరికొందరు మృతి చెందారు. ప్రస్తుతం 51 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది. హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 45,541 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,08,338 మందికి పైగా గాయాలపాలయ్యారని పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వ శాఖ చెబుతోంది.