Free Vaikunta Dwara Darshnam Tickets: హిందువులకు ముక్కోటి ఏకాదశి పర్వదినం చాలా ప్రత్యేకమైంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు. ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే విష్ణు ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంటుంటారు. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వెళ్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మరి మీరు కూడా ఈ వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను అందించనుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
టికెట్ల జారీ తేదీలివే: 2025, జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు సుమారు 10 రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే భక్తులు శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనాలకు జనవరి 9న ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలిపి మొత్తం 91 కౌంటర్లలో టోకెన్లు అందించనున్నాపు. ఇక జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు ఏడు రోజుల పాటు ఏరోజూకారోజున ముందు రోజు టోకెన్లు జారీ చేసేందుకు వీలుగా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో ఏర్పాట్లు చేస్తున్నారు.
టోకెన్లు జారీ చేసే కేంద్రాలివేే: శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి టోకెన్లు మంజూరు చేయనున్నారు. దీంతో పాటు భైరాగి పట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి టోకెన్లు అందించనున్నారు. అదే విధంగా స్థానికుల కోసం ప్రత్యేకంగా తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో టికెట్లు ఇవ్వనున్నట్లు టీటీడీ వెల్లడించింది. మొత్తంగా 8 కేంద్రాలలోని 91 కౌంటర్ల వద్ద వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్లు మంజూరు చేయనున్నారు.
ఇవి కావాల్సిందే: ఉచిత టోకెన్లు పొందాలంటే భక్తులు తమ ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్లను జారీ చేస్తారని తెలుపుతున్నారు. టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని, టోకెన్లు లేకపోతే ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని వివరిస్తున్నారు.
ముమ్మరంగా ఏర్పాట్లు: వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్లు పంపిణీ చేసేందుకు ఆయా కేంద్రాల వద్ద కౌంటర్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే భక్తుల భద్రత, సౌకర్యాలకు అధిక ప్రాధాన్యమిస్తూ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లు, బారికేడ్లు, షెడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఆ దర్శనాలు రద్దు: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలను పురస్కరించుకుని సామాన్య భక్తుల సౌకర్యార్థం 10 రోజుల పాటు సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు ప్రకటించారు. జనవరి 10 నుంచి 19 వరకు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐ, రక్షణ సిబ్బంది స్పెషల్ దర్శనాలను టీటీడీ రద్దు చేసినట్లు వెల్లడించారు.
తిరుమల శ్రీవారి అధ్యయనోత్సవాలు - విశిష్టత ఇదే!
తిరుమల శ్రీవారి దర్శనానికి ఎన్ని దారులో - ఇవి తెలిస్తే దర్శనం సులభమే
తిరుమల చక్రతీర్థ ముక్కోటిని కళ్లారా చూస్తే చాలు- మోక్ష సిద్ధి ఖాయం!