Gold Forecast :రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హెజ్బొల్లాతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ సూత్రప్రాయంగా అంగీకరించడమే ఇందుకు కారణం. త్వరలో అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అధికారం చేపట్టనుంది. ఈ కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు కూడా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
తగ్గనున్న గోల్డ్, సిల్వర్ రేట్లు
ఈ సంవత్సరం మొదట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. కానీ తరువాత అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా క్రమంగా దిగివచ్చాయి. ఇండియన్ మార్కెట్లో బంగారం ధర దాని గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 6.5 శాతం మేర పడిపోయింది. వెండి అయితే దాని గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 13 శాతం వరకు తగ్గిపోయింది. అయితే డిసెంబర్లో ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మరింతగా తగ్గుతాయా? లేదా పెరుగుతాయా? అనే దానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
"ఈ ఏడాది ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.79,535 వరకు పెరిగి, ఇప్పుడు (2024 నవంబర్ 26 నాటికి) రూ.75,041కు పడిపోయింది. బంగారం ధరలపై గ్లోబల్ ఇష్యూస్ ఎప్పుడూ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్, హెజ్బొల్లాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం యూఎస్ డాలర్ ఇండెక్స్ దాని గరిష్ఠ స్థాయికి చేరింది. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం త్వరలోనే అధికారం చేపట్టనుంది. ట్రంప్ పెట్టుబడిదారీ విధానానికి అనుకూలం కనుక ప్రస్తుతం ఇన్వెస్టర్లు బంగారం, వెండి లాంటి లోహాల కంటే డాలర్వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. కనుక బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది."
- అనూజ్ గుప్త, కరెన్సీ అండ్ కమొడిటీస్ హెడ్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్
అనూజ్ గుప్త ప్రకారం- 'స్వల్ప కాలంలో బంగారం ధర రూ.74,600కు చేరవచ్చు. ఒక వేళ ఈ లెవల్ కూడా బ్రేక్ అయితే, గోల్డ్ రేటు రూ.73,900 వరకు కూడా పడిపోవచ్చు. ఇక వెండి ధరల విషయానికి వస్తే, ప్రస్తుతం (2024 నవంబర్ 26) ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర రూ.87,774గా ఉంది. స్వల్పకాలంలో ఇది రూ.86,700 వరకు పడిపోవచ్చు. ఆ లెవల్ కూడా బ్రీచ్ అయితే, సిల్వర్ ధర రూ.82,900కు చేరుకోవచ్చు.'
అంతా ట్రంప్ చేతిలో ఉంది!
డిసెంబర్ తరువాత అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఏర్పడనుంది. కనుక ట్రంప్ ప్రభుత్వం తీసుకునే పరిపాలనాపరమైన నిర్ణయాలు, ప్రవేశ పెట్టే పాలసీలను బట్టి, బులియన్ మార్కెట్ ట్రెండ్ మారుతుంది. కనుక ఏం జరుగుతుందో కాస్త వేచి చూడాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.