Dunzo Founder Kabeer Biswas :ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. ఔను! ఒక ఐడియా కబీర్ బిస్వాస్ జీవితాన్ని మార్చేసింది. ఈయన మరెవరో కాదు ప్రముఖ డెలివరీ సేవల సంస్థ ‘డన్జో’ (Dunzo) వ్యవస్థాపకుడు! నేటి బిజీ ప్రపంచంలో ప్రజల రోజువారీ సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనా విధానమే ఈ కంపెనీ ఏర్పాటు దిశగా కబీర్‌ను నడిపింది. కబీర్ బిస్వాస్ డెలివరీ సేవల వ్యాపారాన్ని తొలుత 2015 జనవరిలో బెంగళూరు సిటీలో ప్రారంభించారు. మొదట్లో డెలివరీ సేవల్లో పాల్గొనే సిబ్బంది యాక్టివిటీని కబీర్ బిస్వాస్ ఒక సాధారణ వాట్సాప్ గ్రూప్‌తో ట్రాక్ చేసేవారు. దాని ద్వారానే వారికి సమాచారాన్ని చేరవేసేవారు. అలా మొదలైన ‘డన్జో’ ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అంచెలంచెలుగా ఎదిగి దాదాపు రూ.6,400 కోట్ల కంపెనీ స్థాయికి చేరింది.
రిస్క్‌లోనే మజా!
కబీర్ బిస్వాస్ 1984లో జన్మించారు. ఆయన 19 ఏళ్ల వయసులో ఉండగానే తండ్రిని కోల్పోయారు. అయితే తండ్రి నుంచి పెద్దమొత్తంలోనే ఆస్తిపాస్తులు కబీర్‌కు లభించాయి. ఈ దన్నుతో ఆయన కొత్తకొత్త వ్యాపారాలు ప్రారంభించి, ప్రయోగాలు చేసే రిస్క్‌ను చేయగలిగారు. తల్లి నుంచి కూడా కబీర్‌కు మంచి ప్రోత్సాహం లభించింది. అందువల్లే తనకు ఆసక్తిని రేకెత్తించే ఆలోచనలతో నిర్భయంగా వ్యాపార ప్రయోగాల పరంపరను కబీర్ కొనసాగించగలిగారు. 2007లో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత కబీర్ తన వృత్తిపరమైన కెరీర్‌ను ప్రారంభించారు. తొలుత భారతీ ఎయిర్‌టెల్‌లో ఉద్యోగంలో చేరారు. మొదట్లో ఈ కంపెనీలోని గ్రామీణ న్యూ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ విభాగంలో పనిచేశారు. కేవలం రెండు సంవత్సరాలలోనే కబీర్ కీలకమైన హోదాలను అందుకోగలిగారు. అనంతరం వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్‌లో కబీర్ పనిచేశారు. కబీర్ Y2CF డిజిటల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో చేరి, డిజిటల్ మీడియా రంగంలోకి ప్రవేశించాడు. అక్కడే ఆయన Hoppr అనే కంపెనీని స్థాపించాడు. ఈ Hoppr కంపెనీని 2014 సంవత్సరంలో హైక్ కంపెనీ కొనుగోలు చేసింది.
గూగుల్, రిలయన్స్ రిటైల్ నుంచి పెట్టుబడులు
ఈ విభిన్న అనుభవాల నేపథ్యంలో కబీర్ 2015 జనవరిలో డన్జోను ప్రారంభించారు. కంపెనీ యాక్టివిటీ కోసం మొదట్లో ఒక చిన్న వాట్సాప్ గ్రూప్‌ను వాడేవారు. డన్జోను నమ్మకమైన, సమర్థవంతమైన డెలివరీ సర్వీస్ ప్రొవైడర్‌గా మార్కెట్‌లో నిలిపే ప్రయత్నం చేశారు. తొలుత డన్జో డెలివరీ సేవలు బెంగళూరుకే పరిమితమై ఉండేవి. కానీ అనంతరం కాలంలో అవి క్రమంగా దిల్లీ, గురుగ్రామ్, పుణె, చెన్నై, జైపుర్, ముంబయి, హైదరాబాద్ నగరాలకు విస్తరించాయి. ఈక్రమంలో 2017 సంవత్సరంలో గూగుల్ కంపెనీ నుంచి ఫండింగ్ పొందిన మొదటి భారతీయ టెక్ కంపెనీగా డన్జో వార్తల్లో నిలిచింది. 2022 జనవరి నాటికి కంపెనీ దాదాపు రూ.5,800 కోట్లను సేకరించింది. 2022 జనవరిలో రిలయన్స్ రిటైల్ నుంచి డన్జోకు రూ.2వేల కోట్ల ఫండింగ్ లభించింది.