Business Succession Planning : వ్యాపార కుటుంబాల వారికి వారసత్వ ప్రణాళిక అనేది అత్యంత కీలకం. ఇది పెర్ఫెక్ట్గా ఉంటేనే ఎన్నో ఏళ్లు కష్టపడి నిర్మించిన వ్యాపార సామ్రాజ్యం భవిష్యత్తులోనూ నిరాటంకంగా కొనసాగుతుంది. ఒకవేళ వారసత్వ ప్రణాళిక స్పష్టంగా, సవ్యంగా లేకుంటే వారసుల మధ్య వైరుధ్యాలు, ఘర్షణలు జరుగుతాయి. ఈ అంశాలు న్యాయవివాదాలుగా మారి ఏళ్ల తరబడి కోర్టుల్లో నానే అవకాశం ఉంటుంది. ఈ వ్యవధిలో వ్యాపారాలు డీలా పడే ముప్పు పొంచి ఉంటుంది. అక్కడిదాకా పరిస్థితి వెళ్లకూడదంటే, వారసత్వ ప్రణాళిక కోసం సరైన పద్ధతిని ఎంచుకోవాలి. గతంలో వీలునామాలు రాసే ట్రెండ్ ఉండేది. అయితే ఇవి వివాదాలకు దారితీసే అవకాశం ఎక్కువ. అందుకే చాలా వ్యాపార కుటుంబాలు ఇప్పుడు 'ప్రైవేట్ ఫ్యామిలీ ట్రస్టు'ల ఏర్పాటుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి.
సాఫీగా ఆస్తుల ఏకీకరణ
ఎలాంటి అడ్డంకులు, జాప్యాలు లేకుండా ఆస్తుల ఏకీకరణ సాఫీగా కొనసాగేందుకు 'ప్రైవేట్ ఫ్యామిలీ ట్రస్టు' ఉపయోగపడుతుంది. తమ తదనంతరం కంపెనీలోని కీలక స్థానాలలోకి ఎవరు ప్రవేశిస్తారు? ఏయే వ్యాపార విభాగాలు ఎవరెవరు పర్యవేక్షిస్తారు? ఈ క్రమంలో ఎలాంటి షరతులు ఉంటాయి? ఆ వ్యాపారం నుంచి వారసులకు ఏ రకంగా, ఎంత మేర ప్రయోజనం లభిస్తుంది? అనేవి 'ప్రైవేట్ ఫ్యామిలీ ట్రస్టు' భవిష్యత్ ప్రణాళికలో చేర్చుకోవచ్చు. అయితే ఈ రూల్స్ వ్యాపారాన్ని బట్టి, కుటుంబ అవసరాలను బట్టి మారిపోతుంటాయి.
ప్రణాళిక విజయవంతం కావాలంటే కుటుంబంలోని ఆస్తుల రకాన్ని బట్టి 'ప్రైవేట్ ఫ్యామిలీ ట్రస్టు' ప్రణాళిక ఉండాలి. ఈ రకం వారసత్వ ప్రణాళిక విజయవంతం కావాలంటే, వారసులు తప్పకుండా సంబంధిత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. ట్రస్ట్‌ను స్థాపించేటప్పుడు దాని ధర్మకర్తలుగా ఎవరు ఉంటారు? అనే దానిపై సదరు వ్యాపార కుటుంబం కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను, ఆప్త మిత్రులను ధర్మకర్తలుగా ప్రతిపాదిస్తుంటారు. మరికొందరు ఏదైనా విశ్వసనీయ ఆర్థిక సంస్థను ధర్మకర్తగా ఎంపిక చేసుకుంటారు.