BUDGET 2024 - Income Tax Slabs And Rates : మోదీ 3.0 ప్రభుత్వం వచ్చిన తరువాత, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్‌ను జులై 23న ప్రవేశపెట్టనున్నారు. ఈ పూర్తి స్థాయి బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపులు ఉంటాయని పన్ను చెల్లింపుదారులు ఆశిస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడం వల్ల ఓటర్లను ప్రలోభ పెట్టకూడదన్న ఉద్దేశంతో, ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో నిర్మలమ్మ పన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. కానీ ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పూర్తిస్థాయిది కావడం వల్ల తమకు పన్ను మినహాయింపులు ఉంటాయని ట్యాక్స్ పేయర్స్ భావిస్తున్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో ఊరట లభిస్తే, ఆ ఆదాయం ట్యాక్స్ పేయర్స్ వ్యక్తిగత వినియోగానికి ప్రత్యక్ష ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ క్రమంలో పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది మంచిది? వీటిలో శ్లాబ్ రేట్లు ఎలా ఉన్నాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గత కొన్నేళ్లుగా ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ముఖ్యంగా ఐటీ శాఖ పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఎన్నో మార్పులు చేస్తోంది. ఆదాయపు పన్ను శ్లాబ్‌ల హేతుబద్ధీకరణ సహా, ఐటీ ఫారమ్‌లను సరళీకృతం చేసింది. ప్రస్తుతం దేశంలో రెండు రకాల ఆదాయపు పన్ను విధానాలు ఉన్నాయి. ఒకటి పాత ఆదాయపు పన్ను విధానం కాగా, ఇంకొకటి కొత్త ఆదాయపు పన్ను విధానం. ఈ రెండింట్లోనూ వేర్వేరు పన్ను శ్లాబ్‌లు ఉంటాయి.
పాత ఆదాయపు పన్ను విధానం :
పాత ఆదాయపు పన్ను విధానంలో సెక్షన్ 80 కింద అనేక పన్ను మినహాయింపులు, తగ్గింపులు ఉన్నాయి. దీని వల్ల ట్యాక్స్ పేయర్స్‌కు పన్ను భారం తగ్గుతుంది.
పాత పన్ను విధానంప్రకారం, ఏడాదికి రూ.2,50,000లోపు ఆదాయం సంపాదించేవారికి ఎటువంటి పన్ను ఉండదు. రూ.2,50,000 - రూ.5,00,000 ఆదాయం ఉన్నవారికి 5 శాతం ట్యాక్స్ పడుతుంది. రూ.5లక్షలు నుంచి రూ.10లక్షలు వరకు ఆర్జించే వారికి రూ.12,500 + రూ.5లక్షలపై 20 శాతం ట్యాక్స్ పడుతుంది. రూ.10లక్షలు కన్నా ఎక్కువ సంపాదించేవారు రూ.1,12,500 + రూ.10లక్షల కంటే ఎంత ఆదాయం ఉన్నా 30శాతం వరకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.