తెలంగాణ

telangana

ETV Bharat / business

'రూ.1.6 లక్షల కోట్ల లాభం కోసం అధికారులకు లంచం!' - గౌతమ్ అదానీపై అమెరికాలో అభియోగాలు

అమెరికాలో గౌతమ్ అదానీపై తీవ్ర ఆరోపణలు - దాదాపు రూ.1.6 లక్షల కోట్ల లాభాలు తెచ్చిపెట్టే సోలార్ ఎనర్జీ కాంట్రాక్టుల కోసం భారత అధికారులు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు

Gautam Adani
Gautam Adani (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : 6 hours ago

Updated : 5 hours ago

Gautam Adani US Bribery Case : మిలియన్ డాలర్లలో లంచం, మోసానికి పాల్పడినట్లు దిగ్గజ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్​లో అభియోగాలు నమోదయ్యాయి. గౌతమ్‌ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.1.68 లక్షల కోట్లు) లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్‌ డాలర్ల లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు అధికారులు అభియోగాలు మోపారు.

యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమీషన్ ప్రకారం, అదానీ అమెరికన్ ఇన్వెస్టర్లను మోసగించారని, అధికారులకు లంచాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. అదానీ సహా మరో ఏడుగురు తప్పుడు స్టేట్‌ మెంట్లు, ప్రకటనల ద్వారా లబ్ధి పొందినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మిలియన్ డాలర్ల లంచం, మోసానికి సంబంధిన ఆరోపణలపై గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్, రంజిత్ గుప్తా, సిరిల్ క్యాబెన్స్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా, రూపేశ్ అగర్వాల్ వంటి వారిపై అభియోగాలు నమోదయ్యాయి.

అదానీ గ్రూప్​పై మరో అభియోగం
మరోవైపు, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ అదానీ గ్రీన్ ఎనర్జీపై అభియోగాలు మోపింది. యూఎస్‌ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్‌ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్‌ డాలర్లకు పైగా నిధులను సమీకరించిందని అందులో ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరిపి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్‌ కోరింది.

స్పందించిన అదానీ గ్రూప్
కాగా, అమెరికా చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. అదానీ గ్రూప్‌- అమెరికా డాలర్‌ డినామినేటెడ్‌ బాండ్‌ ఆఫరింగ్​లో ముందుకువెళ్లకూడదని(బాండ్లు కొనుగోలు చేయకూడదని) నిర్ణయించుకొంది. "అమెరికా జస్టిస్‌ డిపార్ట్​మెంట్‌, ఎస్​ఈసీలు గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీ సహా మా బోర్డు సభ్యులపై నేరాభియోగాలు మోపాయి. దీంతో ప్రతిపాదిత డాలర్‌ డినామినేషన్‌ బాండ్ల విషయంలో ముందుకువెళ్లకూడదని మా అనుబంధ సంస్థ నిర్ణయించింది." అని పేర్కొంది.

Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details