- Adani Stocks Closing Update Today 4:00PM: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా మోపిన అభియోగాల ప్రభావం అదానీ కంపెనీల స్టాక్స్‌పై గట్టిగా పడింది. దీంతో గురువారం అదానీ కంపెనీలు నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్-30 ప్యాక్‌లోని అదానీ పోర్ట్స్ 13 శాతానికి పైగా నష్టపోయింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ సహా ఇతర అదానీ గ్రూప్ స్టాక్‌లు దాదాపు 23 శాతం వరకు నష్టపోయాయి.
అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా పతనమైన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా గురువారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 422.59 పాయింట్లు నష్టపోయి 77,155.79 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 168.60 పాయింట్లు క్షీణించి 23,349.90 వద్దకు ముగించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, NTPC, ITC, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టపోయాయి. పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.
Adani Group Stocks : అంతకుముందు.. ప్రముఖ భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా మోపిన అభియోగాల ప్రభావం అదానీ కంపెనీల స్టాక్స్‌పై పడింది. దీంతో గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో అదానీ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఓ దశలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ స్టాక్స్ 20శాతం పడిపోయింది. సొలార్ ఎనర్జీ కాంట్రాక్టులను చేజిక్కించుకునేందుకు అదానీ గ్రూప్ భారత అధికారులకు దాదాపు 250 మిలియన్ డాలర్లు లంచం చెల్లించిందని అమెరికా ఆరోపించింది. కాగా, అదానీ లిస్టెడ్ కంపెనీల మొత్తం వ్యాల్యూలో రూ.2.45 లక్షల కోట్లు గురువారం తుడిచిపెట్టుకుపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 23శాతం నష్టపోయింది.
అదానీ ప్లాగ్‌షిప్ కంపెనీ- అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఓ దశలో 20 శాతం నష్టపోయాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 19.17 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 18.14 శాతం, అదానీ పవర్ 17.79 శాతం, అదానీ పోర్ట్‌లు 17.79 శాతం మేర క్షీణించాయి. అంబుజా సిమెంట్స్ 14.99 శాతం, ఏసీసీ 14.54 శాతం, ఎన్డీటీవీ 14.37 శాతం, అదానీ విల్మార్ 10, వీటితో పాటు అదానీ గ్రూపునకు చెందిన మరికొన్ని కంపెనీలు కూడా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.