Fastest Growing City In India : దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. 6 ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో బెంగళూరు నిలిచిందని నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించిన ఇండియా ప్రైమ్ సిటీ సూచీ నివేదిక వెల్లడించింది. తుదుపరి స్థానాల్లో ముంబయి, ఎన్సీఆర్ దిల్లీ, అహ్మదాబాద్, చెన్నై ఉన్నాయని నివేదిక తెలిపింది.
మౌలిక సదుపాయాలు, స్థిరాస్తి రంగం విస్తరణ, ప్రభుత్వ విధానాలు- పరిపాలన, జనాభా పెరుగుదల వంటి అంశాల ప్రాతిపదికన ఆయా నగరాలు విస్తరిస్తున్న తీరును ఈ నివేదిక విశ్లేషించింది. ఈ ఆరు ప్రధాన నగరాలు వేగంగా విస్తరిస్తూ, దేశ సత్వర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులామ్ జియా వివరించారు.
స్థిరాస్తి రంగంలో హైదరాబాద్
హైదరాబాద్‌లో గత దశాబ్ద కాలంలో నివాస స్థిరాస్తి రంగం 10% చొప్పున వార్షిక వృద్ధి నమోదు చేసినట్లు నివేదికలో పేర్కొంది. 2023లో 11% వృద్ధి సాధించినట్లు తెలిపింది. పెట్టుబడిదారులు, వినియోగదార్లు కూడా ఇక్కడ స్థిరాస్తులను సొంతం చేసుకునేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. రవాణా సదుపాయాలు బహుముఖంగా విస్తరించడం హైదరాబాద్ నగర విస్తరణకు, స్థిరాస్తి రంగ వృద్ధికి దోహదపడుతున్నట్లు వివరించింది.
వాణిజ్య ఆస్తుల్లో బెంగళూరు
వాణిజ్య ఆస్తులకు (కమర్షియల్ రియల్ ఎస్టేట్) గిరాకీ బెంగళూరులో అధికంగా ఉన్నట్లు ఈ నివేదికలో తెలిపింది. బెంగళూరులో దేశ, విదేశీ సంస్థలెన్నో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఉద్యోగాల సంఖ్య ఎంతో ఎక్కువ. నిరుద్యోగం తక్కువ. విదేశీ పెట్టుబడులను బెంగళూరు నగరం అధికంగా ఆకర్షిస్తోంది. అందువల్ల స్థిరాస్తి రంగం బెంగళూరు అభివృద్ధికి చోదక శక్తిగా మారినట్లు ఈ నివేదిక విశ్లేషించింది.