Women Sufering over harassment in Social Media : భైంసాకు చెందిన ఓ యువతికి హైదరాబాద్ యువకుడు ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు. స్నేహంగా ఉంటూ యువతితో మరింత పరిచయం పెంచుకుని ఆమెను నగరానికి రప్పించాడు. మాట్లాడదామంటూ ఓ హోటల్‌కు తీసుకెళ్లి నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు.
మియాపూర్‌కు చెందిన ఓ బాలిక ఇన్‌స్టాలో పరిచయమైన చింటూ అనే యువకుడిని నమ్మి అతడితో వెళ్లిపోయింది. బాలిక అవసరం తీర్చుకున్న నిందితుడు, పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో భరించలేక హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని చెత్తకుప్పల్లో విసిరేసి పోలీసులకు దొరికిపోయాడు.
ఏటా ఇటువంటివి పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. బాలికలు, యువతులు సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తుల బారినపడుతున్నారు. తెలియని వ్యక్తులతో స్నేహం చేస్తూ లైంగిక దాడులకు గురవుతున్నారు. అవతలి వ్యక్తి నిజస్వరూపం తెలుసుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇటీవలే మియాపూర్‌లో జరిగిన బాలిక హత్యే ఇందుకు ఉదాహరణ. సోషల్ మీడియాలో అపరిచితులను నమ్మి మోసపోతున్న వారిలో ఎక్కువగా 16 నుంచి 19 ఏళ్లు వారే అని పోలీసులు చెబుతున్నారు.
పరిచయమైన అవతలి వ్యక్తులను అంచనా వేయకపోవడం, భవిష్యత్తు పరిణామాలు ఊహించలేకపోవడమే ఇందుకు కారణం. సోషల్ మీడియాల ప్రభావం విపరీతంగా పెరిగి, యువత నుంచి పెద్దలు, గృహిణుల వరకు ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ తదితర మాధ్యమాలను ఉపయోగిస్తున్నారు. చిన్నారులు సైతం వీటిపై వ్యామోహం పెంచుకుంటున్నారు. ఇంటర్‌కు చేరగానే పిల్లలకు తల్లిదండ్రులు ఫోన్లు కొనిస్తున్నారు. మొబైల్ ఫోన్, సోషల్ మీడియాను ఎలా వినియోగించాలో, అపరిచితులతో స్నేహం వల్ల ఎదురయ్యే పరిణామాలేంటో వివరించడం లేదు.
పిల్లలను గమినిస్తూ ఉండాలి : యువతుల్లా నటిస్తూ సోషల్ మీడియాలో అమ్మాయిల ఫొటోలు సేకరించి బెదిరిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. కొందరు నేరగాళ్లు యువతుల డీపీలతో ఫేక్ అకౌంట్ క్రియట్ చేసి యువతులకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తున్నారు. అందంగా ఉన్నావంటూ ఫొటోలు సేకరించి, వాటిని నగ్నంగా మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తుంటారు.
పిల్లలు ఏం చేస్తున్నారో కౌమార దశలోనే తల్లిదండ్రులు పర్యవేక్షిస్తుండాలని వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి తెలిపారు. ఉన్నత విద్యకు కోసం ఇతర ప్రాంతాలకు వెళుతుంటారని, అప్పుడు వారి ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ మార్గనిర్దేశం చేస్తుండాలని సూచించారు. పిల్లలతో స్నేహంగా మాట్లాడుతే సమస్యలు చెప్పేందుకు ముందుకొస్తారని చెప్పారు. ఒకవేళ నేరగాళ్ల చేతికి చిక్కితే ఆలస్యం చేయకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు.