Theft in Jubilee Hills : ఇంటి యజమాని చాలా కేసుల్లో ఇరుక్కున్నాడు. పైగా నెల రోజుల పాటు ఇంటి తాళాన్ని అప్పగించి వెళ్లారు. ఇల్లు మొత్తం దోచేసినా, యజమాని వచ్చి చూసేలోగా సమయం పడుతుంది. ఒకవేళ వచ్చి చూసినా వారికున్న కేసులకు పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం లేదు. వారి బలహీనతలను ఆసరాగా తీసుకొని ముగ్గురు వ్యక్తులు దొంగతనంతో లైఫ్ టైం సెటిల్మెంట్ చేసుకోవాలని చూశారు. కానీ విధి మాత్రం మరోలా వింత నాటకం ఆడింది. జూబ్లీహిల్స్‌లో జరిగిన దొంగతనంలో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని దోచుకున్న నగదు, వస్తువులను స్వాధీనం చేసుకోగా, విచారణ సమయంలో వారి నుంచి వచ్చిన సమాధానాలకు పోలీసులే ఆశ్చర్యపోయారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం, జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 54లోని ప్లాట్ నంబరు 1167లో అఖిలారెడ్డి అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఆమె జులై 18న ఇంటికి తాళం వేసి బెంగళూరు వెళ్లారు. అక్కడి నుంచి ఆమె ఆగస్టు 14వ తేదీన తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఇంటికి వేసిన తాళం పగులగొట్టి ఉండటంతో ఆమెకు అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూసింది. పూజ గదిలోని రెండు వెండి ప్లేట్లు, అలాగే నాలుగో అంతస్తులో ఉన్న డ్రస్సింగ్ గదిలో దాచిపెట్టిన రూ.10 లక్షలు విలువైన బంగారు, వజ్రాభరణాలు కనిపించలేదు. దీంతో ఒక్కసారిగా అవాక్కైన మహిళ వెంటనే ఇంటి కాపలాదారులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుల నుంచి వస్తువులు, నగదు స్వాధీనం : పోలీసు విచారణలో ఆంధ్రప్రదేశ్‌లోని ద్రాక్షారామ ప్రాంతానికి చెందిన కాపలాదారు రేవు సురేష్, తూర్పుగోదావరి జిల్లా నేలపర్తిపాడు గ్రామానికి చెందిన తౌటి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన కాపలాదారు అవిటి పుల్లారావు అలియాస్ పుల్లయ్య చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. వీరిని అరెస్టు చేసి వారి నుంచి వెండి గిన్నెలు, వెండి ప్లేట్లు, చెంచాలు, ప్లాటినం వజ్రపు ఉంగరం, బంగారు గొలుసు, మూడు వేంకటేశ్వరస్వామి లాకెట్లు, ఉంగరం, రూ.5.97 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో పాటు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన వెంటగిరిలోని శాంతినాథ్ జ్యువెలరీ నిర్వాహకుడు యోగేశ్ శాంతిలాల్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ ఇల్లు మాత్రం ఫ్రీలాంచింగ్ పేరుతో మోసాలకు పాల్పడిన సాహితి సంస్థ యజమాని కుమారుడు సాత్విక్‌కు చెందింది.
వారికున్న కేసులకు పోలీసులకు ఫిర్యాదు చేయరు : నిందితులు పోలీసుల విచారణలో తెలిపిన వివరాలు 'మా యజమానులే చాలా కేసుల్లో ఇరుక్కున్నారు. దాదాపు నెల రోజులుగా ఇంటి తాళం అప్పగించి వెళ్లారు. ఎప్పుడు ఇంటికి ఎవరొస్తారో తెలియదు. ఇల్లు మొత్తం దోచేసి యజమానులు వచ్చి చూసేలోగా సమయం పడుతుంది. దీనికి తోడు వారికున్న కేసులకు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం లేదు. ఇంట్లో ఉన్న బంగారం, నగదును దోచుకొని ముగ్గురం సెటిల్ అవ్వాలని అనుకున్నాం." అని నిందితులు తెలిపారు. ముగ్గురు తమ యజమానులకు ఉన్న సమస్యలను అనుకూలంగా మలచుకొని ఈ చోరీకి పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు.
మాజీ ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం - 13 తులాల బంగారం, రూ.50 వేల నగదు స్వాహా