How Many Times Should Chew Food: మీరు రోజు ఆహారాన్ని నమిలి తింటున్నారా? ఇదేం ప్రశ్న ఎవరైనా సరే.. నమిలే తింటారు కదా అని అనుకుంటున్నారా? అయితే, మనం ఆహారాన్ని నమిలే తీరు ఆరోగ్యం మీద గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారాన్ని బాగా నమలటానికీ మధుమేహం వంటి జీవక్రియ జబ్బుల ముప్పు తగ్గటానికీ సంబంధం ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ బఫెలో పరిశోధకుల అధ్యయనంలో తేలింది. Journal of Clinical and Diagnostic Researchలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఇది అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల ముప్పు తగ్గటానికి తోడ్పడుతుందని పరిశోధకులు వివరించారు. అంతేకాకుండా రక్తంలో గ్లూకోజు మోతాదులు తగ్గటానికీ దోహదం చేస్తుందని వెల్లడించారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఆహారాన్ని బాగా నమిలి తినేవారిలో మూడు నెలల గ్లూకోజు మోతాదుల సగటు (హెచ్‌బీఏ1సీ) 7.48 శాతంగా ఉందని.. అంతగా నమలని వారిలో 9.42 శాతం ఉంటున్నట్టు వెల్లడైంది. ఇంకా మధుమేహం గలవారిలో హెచ్‌బీఏ1సీ మోతాదులు ఒక శాతం పెరిగితే గుండెజబ్బుల ముప్పు 40% పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. గ్లూకోజు మోతాదులు దీర్ఘకాలంగా ఎక్కువగా ఉంటుంటే కిడ్నీలు, కళ్లు, నాడులు దెబ్బతినే ప్రమాదమూ ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఫలితంగా పుండ్లు పడితే త్వరగా మానవని చెబుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆహారాన్ని పూర్తిగా నమలి తినాలని సూచిస్తున్నారు. డయాబెటిస్ మందులు వేసుకోవటంతో పాటు ఈ చిన్న జాగ్రత్తను పాటిస్తే చాలా ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.
నమిలినప్పుడు ఏమవుతుంది?
ఆహారాన్ని నమలటంతో చిన్న చిన్న ముక్కలుగా మారి జీర్ణక్రియ మొదలవుతుంది. అదే సమయంలో లాలాజలం ఉత్పత్తి ప్రక్రియ ప్రేరేపితమై.. దీనిలోని ఎంజైమ్‌లు సైతం సమర్థంగా పనిచేస్తాయని వెల్లడించారు. ఫలితంగా ఆహారం తేలికగా జీర్ణమవుతుందని వివరించారు. దీంతో శరీరం పోషకాలను బాగా సంగ్రహించుకుంటుందని.. పీచు వంటి పోషకాలు గ్లూకోజు మోతాదులు తగ్గటంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. రక్తంలోని గ్లూకోజు త్వరగా కలవకుండా పీచు నిలువరిస్తుందని తెలిపారు. పిండి పదార్థాలు త్వరగా విచ్ఛిన్నం కావటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరగటమూ తగ్గుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఇది మధుమేహులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. అంతేకాకుండా నమలటం వల్ల పేగుల్లో ప్రతిచర్యలు ఉత్తేజితమవుతాయని.. ఫలితంగా ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుందని చెబుతున్నారు. ఇవన్నీ డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు మేలు చేసేవని వివరించారు.
మరోవైపు గబగబా తినేవారికి ఇన్సులిన్ నిరోధకత తలెత్తే అవకాశం ఎక్కువని మరో అధ్యయనంలో తేలింది. ఇన్సులిన్ నిరోధకత మధుమేహానికి బీజం వేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇందులో ఇన్సులిన్‌కు కణాలు సరిగా స్పందించవని.. ఫలితంగా గ్లూకోజు కణాల్లోకి పోకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయన్నారు. అందుకే ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమిలి తింటే గ్లూకోజు మోతాదులు నియంత్రణలో ఉంటాయని సలహా ఇస్తున్నారు. ఫలితంగా ఇన్సులిన్‌కు కణాలు స్పందించే తీరు మెరుగవుతుందని చెబుతున్నారు. ఇంకా ఆహారాన్ని నెమ్మదిగా, నములుతూ తినేవారిలో అమైనో ఆమ్లాల వంటి పోషకాలు విడుదల అవుతున్నట్టూ చైనాలోని హర్బిన్ మెడికల్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. శరీరం సక్రమంగా పనిచేయటంలో అమైనో ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయని.. మొత్తంగా ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయని నిపుణులు వివరించారు.
కడుపు నిండిన భావన
జీర్ణాశయం, చిన్నపేగుల నుంచి విడుదలయ్యే ఘ్రెలిన్ ఆనే హార్మోన్ ఆకలిని ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో ముద్దను సుమారు 40 సార్లు నమిలి తినేవారిలో దీని మోతాదులు తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా ఆకలి తగ్గి.. మెదడుకు కడుపు నిండిందనే సమాచారాన్ని చేరవేస్తాయని తెలిపారు. ఆహారాన్ని బాగా నమిలితే అతిగా తినకుండా చూసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఫలితంగా రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరగటమూ తగ్గడమే కాకుండా బరువు తగ్గటానికీ తోడ్పడుతుందని అంటున్నారు.
నెమ్మదిగా నమలుతూ తింటుంటే భోజనం చేస్తున్న భావన కలిగి.. ఆయా పదార్థాల తీరు, రుచులను బాగా ఆస్వాదించొచ్చని సూచిస్తున్నారు. ఇలా మనసు పెట్టి, ఒక్కో ముద్దను ఆస్వాదిస్తూ తింటుంటే మంచి సంతృప్తి కలుగుతుందని అంటున్నారు. ఇలా తినడం వల్ల అనారోగ్యకర పదార్థాల మీదికి మనసు మళ్లటం తగ్గుతుందని వివరించారు. ఇదీ బరువు నియంత్రణలో ఉండటానికి తోడ్పడుతుందని.. ఫలితంగా మధుమేహం ముప్పు, ఊబకాయం సమస్య తగ్గిపోతుందని పేర్కొన్నారు.
బాగా నమలటం ఎలా?
మనలో చాలా మంది సమయం లేదనో, ఆకలి వేస్తుందనో గబగబా తింటుంటారు. కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి చిన్న చిన్న ముద్దలు నోట్లో పెట్టుకొని, నెమ్మదిగా నమలాలని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఆహారం లాలాజలంతో బాగా కలుస్తుందని వివరించారు. ఒక్కో ముద్దను కనీసం 30 సార్లు నమలిన తర్వాతే మింగటం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ వయసు ప్రకారం రోజుకు ఎంతసేపు వాకింగ్ చేయాలో తెలుసా? నడకతో ప్రయోజనాలు తెలిస్తే షాక్!
చలికాలంలో ఏసీ వాడుతున్నారా? ఆస్థమా, ఇన్ఫెక్షన్లతో జాగ్రత్త! ఈ చిట్కాలు పాటిస్తే సరి!!