Pichai Trump Phone Call : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పారిశ్రామిక దిగ్గజం ఎలాన్ మస్క్‌కు ఎక్కడ లేనంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి స్పష్టమైంది. ఎన్నికల్లో గెలిచినందుకు శుభాకాంక్షలు చెప్పాలని గూగుల్ సీఈవో సుందర్‌పిచాయ్ ఫోన్ చేస్తే- ఆ కాల్‌లో ఎలాన్ మస్క్‌నూ ట్రంప్ కలిపారు. అయితే ఆ కాల్‌లో వారు ఏం మాట్లాడారన్న దానిపై పూర్తి వివరాలు తెలియరాలేదు.
అమెరికా ఎన్నికల్లో గూగుల్ పక్షపాతంగా వ్యవహరిస్తోందని గతవారమే మస్క్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజా ఫోన్ కాల్ ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రంప్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే కమలాహారిస్ గురించిన వార్తలు కనిపిస్తున్నాయని అప్పుడు ఆరోపించిన మస్క్ అది ఎన్నికలను ప్రభావితం చేస్తుందన్న సంకేతాలిచ్చారు.
గతంలో ఉక్రెయిన్ సహా వివిధ దేశాధినేతలు ఫోన్ చేసినప్పుడు కూడా ట్రంప్ ఇలాగే కాల్‌ను మస్క్‌కు కనెక్ట్ చేశారు. ఇప్పటికే తన ప్రభుత్వంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీకి చీఫ్‌గా మస్క్‌ను ట్రంప్ నియమించనున్నట్లు ప్రకటించారు. ట్రంప్ సర్కార్ నిర్ణయాల్లో మస్క్ చాలా కీలకంగా వ్యవహరిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.
గూగుల్ క్రోమ్ ఆధిపత్యాన్ని నియంత్రించాల్సిందే: యూఎస్ రెగ్యులేటర్లు
సెర్చ్ ఇంజిన్ వాటాలను విక్రయిస్తేనే ఏకఛత్రాధిపత్యాన్ని అడ్డుకోవచ్చని ఫెడరల్ జడ్జిని అభ్యర్థించిన యూఎస్ రెగ్యులేటర్లు. ఈ మేరకు 23 పేజీల దస్త్రం సమర్పించారు. గూగుల్ కేసుకు సంబంధించి వచ్చే ఏడాది అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి అమిత్ మెహతా తీర్పు వెలువరించనున్నారు.