BH Number Plate Vehicle Tax : 'భారత్' సిరీస్(BH) నంబర్ ప్లేటు కలిగిన వాహనదారులకు బిగ్ అలర్ట్. వారంతా రానున్న 14 ఏళ్ల వాహన పన్నును ఒకేసారి ముందస్తుగా చెల్లించాలి. ఇంతకుముందు రెండేళ్లకోసారి ఈ పన్నును చెల్లించే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో 14 ఏళ్లకోసారి ఏకమొత్తంలో పన్నును కట్టేయాలనే నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు.
బీహెచ్ నంబర్ ప్లేట్లతో 731 వాహనాలు
2021 సంవత్సరం నుంచి కేంద్ర రవాణా శాఖ 'బీహెచ్' నంబర్ ప్లేట్లను జారీ చేస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నడుమ నిత్యం రాకపోకలు సాగించే వ్యాపారులు, ఉద్యోగులు, నిపుణులు, రాజకీయ నాయకుల సౌకర్యం కోసం ఈ నంబర్ ప్లేట్లను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ఇలాంటి వారికి వివిధ రాష్ట్రాల ఆర్టీఓ కార్యాలయాల్లో ప్రత్యేక అనుమతులను పొందాల్సిన తిప్పలు తప్పాయి. ఎంతో సమయం, ధనం ఆదా అయింది. దేశంలోని ఒకటి మించిన రాష్ట్రాల్లో తిరిగే వాహనాలపై జాతీయ స్థాయిలో ఒక డేటాబేస్ తయారైంది. ప్రస్తుతం మన దేశంలో బీహెచ్ నంబర్ ప్లేటు కలిగిన 731 వాహనాలు ఉన్నాయని అంచనా. 14 ఏళ్ల ట్యాక్సును ఒకేసారి చెల్లించాలంటూ వారందరికీ కేంద్ర రవాణాశాఖ, సంబంధిత రాష్ట్ర విభాగాలు త్వరలోనే నోటీసులు పంపనున్నాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నగదు చెల్లించడానికి ఆయా వాహనదారులకు 60 రోజుల సమయం ఇస్తారని అంటున్నారు. అయితే ఈ వివరాలను అధికార వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు.