Bank Locker Rules 2024 :విలువైన ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలు లాంటివి సురక్షితంగా భద్రపరుచుకోవడానికి బ్యాంక్ లాకర్లు చాలా అనువుగా ఉంటాయి. మరి మీరు కూడా మీ దగ్గర ఉన్న విలువైన నగలను, పత్రాలను బ్యాంక్ లాకర్లో భద్రపరచాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ సహా పలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లోని లాకర్స్ గురించి, వాటి నియమ, నిబంధనల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. అప్పుడే మీ అవసరాలకు తగిన సరైన బ్యాంక్ లాకర్‌ను ఎంచుకోవడానికి వీలవుతుంది. పైగా అదనపు ఛార్జీల భారం తగ్గుతుంది.
బ్యాంక్ లాకర్లో ఉంచదగిన, ఉంచకూడని వస్తువులు ఇవే!
బ్యాంక్ లాకర్స్‌లో ఏ వస్తువులు బడితే ఆ వస్తువులను ఉంచుకోవడానికి వీలుండదు. అందుకే ఇప్పుడు బ్యాంకు లాకర్లో ఉంచదగిన, ఉంచకూడని వస్తువుల గురించి తెలుసుకుందాం.
బ్యాంక్ లాకర్లో స్టోర్ చేయదగిన వస్తువులు :
- బంగారు, వెండి నగలు, వజ్రాలు సహా విలువైన లోహాలతో చేసిన ఆభరణాలు బ్యాంక్ లాకర్లో ఉంచుకోవచ్చు. అలాగే విలువైన నాణేలు, గోల్డ్, సిల్వర్ బార్స్ కూడా లాకర్లో దాచుకోవచ్చు.
- మీ ఆస్తి పత్రాలు, పవర్ ఆఫ్ అటార్నీ, వీలునామా సహా లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ లాకర్లో భద్రపరుచుకోవచ్చు.
- మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, షేర్ సర్టిఫికెట్స్, ట్యాక్సెస్, ఇన్సూరెన్స్ పాలసీలు సహా మీ ఫైనాన్సియల్ రికార్డ్‌లు అన్నింటినీ బ్యాంక్ లాకర్లో ఉంచుకోవచ్చు.
బ్యాంక్ లాకర్లో ఉంచకూడని వస్తువులు :
- ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) సహా నిషేధిత వస్తువులను, పదార్థాలు.
- త్వరగా పాడైపోయే ఆహార పదార్థాలు, కాలక్రమంలో పాడైపోయే పదార్థాలు, వస్తువులు లాకర్లో ఉంచడానికి వీలుపడదు.
- తినగలిగే నిల్వ పదార్థాలు, రేడియోధార్మిక పదార్థాలు, హానికరమైన వస్తువులు కూడా లాకర్లో ఉంచకూడదు.
- బ్యాంకు లాకర్లో నగదు ఉంచుకోవడానికి కొన్ని బ్యాంకులు అనుమతించవు. ఎందుకంటే నగదు అనేది సురక్షితమైనది కాదు, అలాగే దానికి ఇన్సూరెన్స్ కూడా ఉండదు.