తెలంగాణ

telangana

ETV Bharat / business

మీకు ఉద్యోగం లేదా? కానీ పెన్షన్ కావాలా? అయితే ఈ స్కీమ్ మీకోసమే!

ఉద్యోగం లేకున్నా 60 ఏళ్ల తర్వాత పెన్షన్ - ఎలాగంటే?

Atal Pension Yojana
Atal Pension Yojana (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Atal Pension Yojana : ఉద్యోగాలు చేస్తున్న వారికి పదవీ విరమణ తర్వాత పెన్షన్ వస్తుందనే విషయం అందరికి తెలిసిందే. దీంతో వారికి రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసా ఉంటుంది. మరి అసంఘటిత రంగంలోని కార్మికులకు, అల్పాదాయ వర్గాల ప్రజలకు అలాంటి పెన్షన్ సౌకర్యాలు ఉండవు. దీంతో వారు ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో 60 ఏళ్లు దాటిన తర్వాత అసంఘటిత రంగ కార్మికులకు సైతం పెన్షన్ అందించాలని కేంద్రం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. అదే అటల్ పెన్షన్ యోజన. ఇందులో చేరిన వారికి గరిష్ఠంగా నెలకు రూ.5 వేల వరకు పెన్షన్ పొందొచ్చు. ఈ క్రమంలో అటల్ పెన్షన్ యోజన లో ఎలా చేరాలి? అర్హతలేంటి? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసా కోసం!
అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ను 2015లో తీసుకొచ్చింది. ఇందులో 18- 40 ఏళ్ల మధ్య వయసున్నవారు చేరొచ్చు. పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడకుండా జీవించాలనుకునేవారికి ఈ స్కీమ్ మంచి ఆప్షన్ అవుతుంది. రిటైర్మెంట్ తర్వాత కూడా సుఖంగా బతికేందుకు కొంత ఆదాయాన్ని అందిస్తుంది.

అటల్ పెన్షన్ యోజన వల్ల ప్రయోజనాలు
గ్యారెంటీడ్ పెన్షన్ : చందాదారుడి కంట్రిబ్యూషన్ ఆధారంగా, 60 ఏళ్ల తర్వాత రూ. 1,000- రూ. 5,000 వరకు స్థిరమైన నెలవారీ పెన్షన్ పొందుతారు.

ప్రభుత్వ సహకారం :
అర్హత ఉన్న చందాదారులకు భారత ప్రభుత్వం మొత్తం కంట్రిబ్యూషన్ లో 50 శాతం లేదా ఐదేళ్లపాటు రూ. 1,000 (ఏది తక్కువైతే అది) సాయం చేస్తుంది.

జీవితకాల పెన్షన్ :
60 ఏళ్ల తర్వాత, చందాదారుడు జీవితాంతం నెలవారీ పెన్షన్​ను పొందుతాడు. ఒకవేళ చందాదారుడు మరణిస్తే అతడి జీవిత భాగస్వామికి పెన్షన్ అందుతుంది. ఆమె మరణం తర్వాత, నామినీకి కార్పస్ ఫండ్ అందుతుంది.

పన్ను ప్రయోజనాలు : అటల్ పెన్షన్ యోజన స్కీమ్ లో చేరినవారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ కింద పన్ను మినహాయింపులు ఉంటాయి.

అటల్ పెన్షల్ యోజనలో చేరడానికి ఏజ్ లిమిట్ ఎంత?
18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఈ అటల్ పెన్షన్ స్కీమ్‌ లో చేరవచ్చు. తక్కువ వయసులో ఈ పథకంలో చేరితే నెలవారీ కంట్రిబ్యూషన్ తక్కువగా ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ ఎలా?
-అటల్ పెన్షల్ యోజన స్కీమ్​లో చేరాలంటే పోస్టాఫీసు లేదా ప్రభుత్వ బ్యాంకుల్లో పొదుపు ఖాతా కలిగి ఉండాలి. అక్కడ ఈ స్కీమ్ లో చేరడం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

-అటల్ పెన్షల్ యోజన ఫారమ్​ను బ్యాంక్ వెబ్‌ సైట్ల నుంచి ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదంటే బ్యాంకు బ్రాంచ్‌ లోనైనా ఈ ఫారమ్ లభిస్తుంది.

-మీ ఆధార్ నంబర్, కాంటాక్ట్ వివరాలు, నామినీ తదితర వివరాలను అటల్ పెన్షల్ యోజన ఫారమ్‌ లో నింపాలి. మీరు ఈ స్కీమ్ లో ఎంత మొత్తం కట్టాలనుకుంటున్నారో కూడా ఫిల్ చేయాలి.

ఆ తర్వాత స్కీమ్​కు విరాళాలు మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ కట్ అవుతాయి. ఆన్​లైన్ ద్వారా కూడా అటల్ పెన్షన్ యోజన స్కీమ్​లో చేరవచ్చు.

మరిన్ని విషయాలు

కంట్రిబ్యూషన్ :
మీ వయసు, కావలసిన పెన్షన్ మొత్తం ఆధారంగా మీ నెలవారీ కంట్రిబ్యూషన్ మారుతూ ఉంటుంది. తక్కువ వయసులో అటల్ పెన్షన్ యోజనలో చేరితే, కంట్రిబ్యూషన్ కూడా తక్కువ మొత్తంలో ఉంటుంది.

ఫ్లెక్సిబిలిటీ :
మీరు పెన్షన్ మొత్తాన్ని లేదా నెలవారీ కంట్రిబ్యూషన్​ను మార్చుకోవచ్చు. అయితే ఆ మార్పులను తప్పనిసరిగా మీ బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు తెలియజేయాలి.

పెనాల్టీ :
మీరు నెలవారీ చందాను కట్టకపోతే జరిమానా పడుతుంది. 24 నెలల పాటు కంట్రిబ్యూషన్‌ చెల్లించకపోతే, మీ ఖాతా డీయాక్టివేట్ అవుతుంది.

EPF పెన్షనర్లకు గుడ్ న్యూస్ - దీపావళికి ఎర్లీగా పెన్షన్‌ రిలీజ్

త్వరలో రిటైర్‌ కానున్నారా? ఫారమ్ 6Aతో సులువుగా పెన్షన్ క్లెయిమ్ చేయండిలా! - Pension Claim With New Form 6A

ABOUT THE AUTHOR

...view details