UPI For NRIs : మన దేశంలో డిజిటల్ పేమెంట్లు బాగా పెరిగిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) చొరవతో ఎన్నో సరికొత్త యూపీఐ ఫీచర్లు - డిజిటల్ పేమెంట్ విభాగంలో వచ్చాయి. యూపీఐ సర్కిల్ నుంచి ఇన్‌స్టాంట్ లోన్లు, యూపీఐ ఎనేబుల్డ్ క్రాస్ బోర్డర్ లావాదేవీల వరకు ఎన్నో ఫీచర్లు ఇప్పుడు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఇవి యూజర్లకు తిరుగులేని సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని ఆస్వాదిస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం.
యూపీఐ సర్కిల్
'యూపీఐ సర్కిల్ ఫర్ షేర్డ్ డిజిటల్ పేమెంట్స్' చక్కటి ఫీచర్. ఒకే బ్యాంకు అకౌంటు నుంచి ఇద్దరు వ్యక్తులు ఏకకాలంలో యూపీఐ/డిజిటల్ లావాదేవీలు చేయడానికి అనుమతించడమే ఈ ఫీచర్ ప్రత్యేకత. ఇంటి యజమాని, అతడు/ఆమె పిల్లలు, సంరక్షకులు కలిసి లావాదేవీలు చేయడానికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఆర్థిక లావాదేవీలపై వారందరికీ మంచి నియంత్రణ కూడా అందిస్తుంది.
యూపీఐ సర్కిల్‌లో బ్యాంకు ఖాతాను కలిగి ఉన్న వ్యక్తిని ప్రైమరీ యూజర్ అంటారు. ఇతడి/ఈమె అనుమతితోనే ఇతర వ్యక్తులు యూపీఐ సర్కిల్‌లో సభ్యులుగా చేరే అవకాశం ఉంటుంది. సభ్యులుగా చేరే వారికి పూర్తిస్థాయిలో లావాదేవీలు చేసేందుకు అనుమతి ఇవ్వాలా? పాక్షిక లావాదేవీలకు అధికారం ఇవ్వాలా? అనేది ప్రైమరీ యూజర్ నిర్ణయించాలి. సభ్యులకు పూర్తిస్థాయిలో లావాదేవీలు చేసే అవకాశమిస్తే బ్యాంకు ఖాతా నుంచి ప్రతినెలా రూ.15వేల దాకా చెల్లింపులు చేయొచ్చు. ఒకవేళ సభ్యులను పాక్షిక లావాదేవీలకు మాత్రమే పరిమితం చేస్తే, వాళ్లు చెల్లింపు చేసే ప్రతిసారి ప్రైమరీ యూజర్‌కు రిక్వెస్టును పంపాలి. దాన్ని ప్రైమరీ యూజర్ 30 నిమిషాల్లోగా ఆమోదిస్తేనే చెల్లింపు చేసే అవకాశం లభిస్తుంది.
‘యూపీఐ-పే నౌ’తో దేశాల మధ్య చెల్లింపులకు రెక్కలు
భారత్, సింగపూర్ మధ్య 'యూపీఐ - పే నౌ' ఇంటర్ లింక్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల ఇరుదేశాల మధ్య ప్రజలు ఇన్‌స్టాంట్ చెల్లింపులు చేయొచ్చు. చాలా తక్కువ ఛార్జీలతోనే ఈ చెల్లింపులు పూర్తవుతాయి. ఇందుకోసం సింగపూర్‌కు చెందిన పే నౌ, భారత్‌కు చెందిన యూపీఐ విభాగాలు జట్టు కట్టాయి. భారత్ తరఫున ఈ ఒప్పందంలో యాక్సిస్ బ్యాంకు, డీబీఎస్ బ్యాంక్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఎస్‌బీఐ భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. సింగపూర్ వైపు నుంచి డీబీఎస్ బ్యాంక్ సింగపూర్, లిక్విడ్ గ్రూప్ అనే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ భాగస్వామ్యం పొందాయి. 'యూపీఐ - పే నౌ' లింక్ ద్వారా రోజూ గరిష్ఠంగా రూ.60వేల (1000 సింగపూర్ డాలర్లు) వరకు లావాదేవీలు చేసుకోవచ్చు.
యూపీఐలో ఇన్‌స్టాంట్ లోన్స్
గూగుల్ పే, పేటీఎం, పేజ్ యాప్, భీమ్ వంటి యూపీఐ యాప్స్‌లో ఇన్‌స్టాంట్ లోన్స్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి ఈ ఫీచర్‌ను 2023 సెప్టెంబరులో ఎన్‌పీసీఐ ప్రవేశపెట్టింది. ఇది ప్రీ అప్రూవ్డ్ లోన్ లాంటిది. యూపీఐ యూజర్ల క్రెడిట్ స్కోరు ఆధారంగా లోన్ అమౌంట్ నిర్ణయమవుతుంది. యూపీఐ ద్వారా కొనుగోళ్లు చేసేటప్పుడు ఈ లోన్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈ రుణాన్ని ఆమోదించే ప్రక్రియ పూర్తిగా డిజిటల్ రూపంలో జరిగిపోతుంది. ఎలాంటి పేపర్ వర్క్ ఉండదు. అత్యవసరాలు, విద్య, వైద్యం, వ్యాపారం వంటి వాటికి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని పొందొచ్చు. యూపీఐ ఖాతాకు లింక్ చేసిన బ్యాంకు అకౌంటు ద్వారా రుణం కోసం దరఖాస్తు చేయాలి. ఆదాయ స్టేట్‌మెంట్లు, ఐడీ కార్డులు, చిరునామా ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి. క్రెడిట్ రిపోర్టు, గతంలో రుణాలను తీసుకొని తిరిగి చెల్లించిన చరిత్ర ఆధారంగా రుణాన్ని మంజూరు చేస్తారు. ఈ రుణంపై వడ్డీరేటును బ్యాంకు నిర్ణయిస్తుంది.
యూపీఐ లైట్
యూపీఐ లైట్ ఫీచర్‌ను ఎన్‌పీసీఐ 2022 సెప్టెంబరులో ప్రవేశపెట్టింది. దీని ద్వారా రూ.5వేలలోపు లావాదేవీలను చేయొచ్చు. యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయకుండానే వేగంగా లావాదేవీని పూర్తి చేసే వెసులుబాటు ఉండటం ఈ ఫీచర్ ప్రత్యేకత. యూపీఐ లైట్ ఖాతాకు యూజర్లు డబ్బులను యాడ్ (టాప్ అప్) చేసుకోవచ్చు. గూగుల్ పే, పేటీఎం, భిమ్ వంటి యాప్‌లలో ఇది అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ అమలులో కెనరా బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు సహా పలు బ్యాంకులు భాగంగా ఉన్నాయి.
ఫీచర్ ఫోన్ల యూజర్లకు ‘యూపీఐ123పే’
‘యూపీఐ123పే’ ఫీచర్‌ను ఎన్‌పీసీఐ 2022 సంవత్సరం మార్చిలో ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్ చేసే అవకాశాన్ని కల్పించడమే ఈ ఫీచర్ ప్రత్యేకత. ఇందులో భాగంగా యూజర్లు ఒక నంబరుకు డయల్ చేయాలి. అందులోకి వెళ్లాక నిర్ణీత సర్వీసును ఎంపిక చేయాలి. తదుపరిగా ఎవరికి మనం పంపుతున్నామో వారి వివరాలను ధ్రువీకరించాలి. చివరగా యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయాలి. దీంతో లావాదేవీ పూర్తవుతుంది. ఈ ఫీచర్‌లో రిజిస్టర్ చేసుకునేందుకు 4 నుంచి 6 అంకెల యూపీఐ పిన్ అవసరం. అన్ని లావాదేవీల కోసం ఆ పిన్‌నే వాడాలి. ఒక దఫాలో రూ.10వేల దాకా లావాదేవీని చేయొచ్చు. ఈ ఫీచర్ ఆంగ్లం, హిందీ సహా 12 భాషల్లో అందుబాటులో ఉంది.
ఎన్‌ఆర్‌ఐల కోసం యూపీఐ
2024 సంవత్సరం నుంచి ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్ఐలు) కూడా సులభంగా యూపీఐ సేవలను వినియోగించగలుగుతున్నారు. ఇంటర్నేషనల్ మొబైల్ నంబరు ద్వారా వారు యూపీఐ ఖాతాను క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు భారతీయ నంబర్లు ఉంటేనే ప్రవాస భారతీయులు యూపీఐ ఖాతాను తయారు చేసుకోగలిగేవారు. ఇక ఆ అవసరం ఉండదు. అయితే ఈ ఫీచర్ అమెరికా, యూఏఈ, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, యూకే, సౌదీ అరేబియా, ఒమన్, హాంకాంగ్ దేశాల్లో ఉండే ఎన్‌ఆర్‌ఐలకు మాత్రమే అందుబాటలోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు అక్కడి నుంచి భారత్‌లోని బ్యాంకు ఖాతాలకు యూపీఐ పేమెంట్లు చేయొచ్చు. నగదును బదిలీ చేయొచ్చు. బిల్ చెల్లింపులు చేయొచ్చు. కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు చేయొచ్చు.
నయా స్కామ్- మీ అకౌంట్లో ఫ్రీగా రూ.5వేలు డిపాజిట్- ఆనందంతో క్లిక్ చేస్తే అంతా ఖాళీ!
UPI అకౌంట్‌కు క్రెడిట్ కార్డ్ లింక్ చేసుకోవాలా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదిగో!