Sundar Pichai Cricket Team Bid : ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ లండన్‌కు చెందిన క్రికెట్ జట్టు కోసం వేలం వేసే సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటివ్‌ల కన్సార్షియంలో చేరారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ వంటి టాప్ టెక్ లీడర్లతో కూడిన ఆ గ్రూప్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ లేదా లండన్ స్పిరిట్ జట్టు కోసం 80 మిలియన్ పౌండ్ల (దాదాపు 97 మిలియన్ డాలర్లు- రూ.805.1 కోట్లు) బిడ్ వేయనుంది.
సుందర్ పిచాయ్ చేరిన గ్రూప్‌నకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా, టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్ సత్యన్ గజ్వానీ నేతృత్వం వహిస్తున్నారు. యువ క్రికెట్ అభిమానులను ఆకర్షించడానికి రూపొందించిన క్రికెట్ టోర్నమెంట్ 'ది హండ్రెడ్' ఎనిమిది జట్లు ప్రైవేట్ పెట్టుబడులను పొందడానికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చేసిన ప్రయత్నంలో భాగంగా బిడ్ దాఖలవుతున్నట్లు తెలుస్తోంది.
100-బాల్ ఫార్మాట్‌ను అనుసరించే ది హండ్రెడ్ లీగ్ 2021లో ప్రారంభమైంది. అధిక సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించడంలో విజయవంతమైంది. లీగ్‌లో ఎనిమిది జట్లు పాల్గొంటుండగా, ప్రతి ఒక్కటి యూకేలోని ఒక ప్రధాన నగరానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. అలా ఇప్పుడు ఓవల్ ఇన్విన్సిబుల్స్ లేదా లండన్ స్పిరిట్ జట్టు కోసం బిడ్ వేసే గ్రూప్‌లో సుందర్ పిచాయ్ చేరారు.
అయితే సుందర్‌కు క్రికెట్ పట్ల ఎంతో ఆసక్తి ఉంది. ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన విషయాలపై స్పందిస్తుంటారు. వివిధ టోర్నీల్లో విజేత ఎవరనే విషయంపై జోస్యం చెబుతుంటారు. ఇటీవల టీమ్ ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించి వార్తల్లో నిలిచారు. ఆస్ట్రేలియా, భారత్ మధ్య గబ్బా వేదికగా జరిగిన టెస్ట్‌లో బంతితో అదరగొట్టిన బుమ్రా, తన బ్యాటింగ్ గురించి తెలుసుకోవాలంటే గూగుల్‌లో వెతకండంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సుందర్ పిచాయ్ స్పందించారు. తాను గూగుల్ చేశానని అన్నారు. కమిన్స్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టినవారికి బ్యాటింగ్ ఎలా చేయాలో చాలా బాగా తెలుసని చెప్పారు. భారత్‌కు ఫాలో ఆన్ గండాన్ని తప్పించాడంటూ ప్రశంసించారు.