తెలంగాణ

telangana

అంబానీ పెళ్లికి సర్వం సిద్ధం- జియో సెంటర్​లో అతిధుల మధ్య గ్రాండ్​గా వివాహం - Anant Ambani Wedding

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 4:07 PM IST

Anant Ambani Wedding : అపర కుబేరుడు ముకేశ్​ అంబానీ ఇంట శుక్రవారం (జులై 12న) పెళ్లిబాజాలు మోగనున్నాయి. ముంబయి నగరంలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా శుక్రవారం రోజు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్​ పెళ్లి జరగనుంది. అనంతరం జులై 14న ముంబయిలోనే గ్రాండ్​గా రిసెప్షన్ జరగనుంది.

Anant Ambani Wedding
Anant Ambani Wedding (Assosiated Press)

Anant Ambani Wedding : ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్​ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి వేళైంది. ముంబయి నగరంలో ముకేశ్​ అంబానీకి చెందిన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా శుక్రవారం (జులై 12న) అనంత్ అంబానీ- రాధిక మర్చంట్​ వివాహం ఘనంగా జరగనుంది. అట్టహాసంగా జరిగే ఈ వేడుకకు వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరుకానున్నారు. ఇటీవలే జరిగిన సంగీత్ వేడుకల్లో ఆలియా భట్, రణ్‌వీర్ సింగ్, సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ తారలు సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక పెళ్లి రోజు కూడా సెలెబ్రిటీలు, సినీ తారల సందడితో పెళ్లి వేదిక కళకళలాడనుంది. ఇక జులై 14న ముంబయిలోనే గ్రాండ్​గా రిసెప్షన్ జరగనుంది.

పెళ్లికి ముస్తాబైన అంబానీ నివాసం (Assosiated Press)

3వేల ఎకరాల్లో జంతు సంరక్షణ కేంద్రం
రిలయన్స్ ఇండస్ట్రీస్ వెబ్‌సైట్ ప్రకారం 29ఏళ్ల అనంత్ అంబానీ అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లో ఉన్న బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ప్రస్తుతం ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రీన్ ఎనర్జీ విస్తరణ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌నగర్‌లో 'వన్​తార' పేరుతో 3,000 ఎకరాల్లో జంతు సంరక్షణ కేంద్రాన్ని నడుపుతున్నారు. అంబానీ కుటుంబం స్వస్థలం జామ్‌నగర్‌ కావడం వల్ల అక్కడే జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

అనంత్ అంబానీ- రాధికా మర్చంట్​ (Assosiated Press)

స్నేహితుల ద్వారా పరిచయం
మరోవైపు వధువు రాధికా మర్చంట్ వయసు కూడా 29 సంవత్సరాలే. ఫార్మాసుటికల్ వ్యాపారవేత్త, ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌ వ్యవస్థాపకులు వీరేన్ మర్చంట్ కుమార్తె ఈ రాధికా మర్చంట్. 2017లో స్నేహితుల ద్వారా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత డేటింగ్​కు వెళ్లామని ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రాధికా మర్చంట్ వెల్లడించారు.

అంబానీ కుటుంబం (Assosiated Press)

27 అంతస్తులతో ముకేశ్ అంబానీ నివాసం
అనంత్ అంబానీ తండ్రి ముకేశ్​ అంబానీ వయసు 66 ఏళ్లు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఈయన ప్రస్తుతం రూ.9లక్షల కోట్ల సంపదతో ప్రపంచంలోనే 9వ అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. ఆసియాలో అత్యంత సంపన్నుడు ఈయనే. రిలయన్స్ ఇండస్ట్రీస్ అతిపెద్ద వ్యాపారాల్లో పెట్రోకెమికల్స్, చమురు, గ్యాస్, టెలికాం, రిటైల్ విభాగాలు కీలకమైనవి. ఈ వ్యాపార విభాగాల నుంచి రిలయన్స్ గ్రూపునకు ప్రస్తుతం ఏటా రూ.8లక్షల కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ముకేశ్ అంబానీ కుటుంబానికి ముంబయిలో రూ.8వేల కోట్లు విలువైన ఇల్లు ఉంది. 'యాంటిలియా' పేరుతో నిర్మించిన ఈ భవనంలో 27అంతస్తులు ఉన్నాయి. మూడు హెలిప్యాడ్‌లు, 160 కార్ల పార్కింగ్ కోసం గ్యారేజీ, ఒక ప్రైవేట్ సినిమా థియేటర్, స్విమ్మింగ్ పూల్, ఫిట్‌నెస్ సెంటర్ కూడా ఇందులోనే ఉన్నాయి. ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి రిలయన్స్ జియోను అప్పగించారు. కుమార్తె ఇషా అంబానీకి రిలయన్స్ రిటైల్‌ బిజినెస్‌ను అప్పగించారు. చిన్నకుమారుడు అనంత్ అంబానీకి న్యూ ఎనర్జీ ఇంధన వనరుల వ్యాపారాన్ని కేటాయించారు.

విద్యుత్​ వెలుగుల్లో అంబానీ నివాసం (Assosiated Press)

అంబానీలా మజాకా - పెళ్లి భోజనాల మెనూ చూస్తే కళ్లు తిరగాల్సిందే! - Anant Ambani Wedding Menu

మనవళ్లతో ముకేశ్‌-నీతా అంబానీ కారు షికారు - వీడియో చూశారా? - Anant Ambani Radhika Wedding

ABOUT THE AUTHOR

...view details