Air India Orders 100 Airbus Planes :టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా దూకుడు మీద ఉంది. మరిన్ని కొత్త విమానాలను కొనుగోలు చేస్తోంది. యూరప్‌నకు చెందిన విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌కు మరో వంద విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపింది. ఇందులో 10 వైడ్‌బాడీ ఏ350 విమానాలు ఉన్నాయి. 90 నారోబాడీ ఏ320 తరగతికి చెందిన విమానాలు ఉన్నాయి. గతేడాది ఎయిర్‌బస్, బోయింగ్‌కు కలిపి 470 విమానాల కోసం చేసిన ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు చేసిన 100 విమానాల ఆర్డర్ దానికి అదనం.
దూకుడు మీదున్న ఎయిర్ ఇండియా - మరో 100 విమానాల కొనుగోలుకు ఎయిర్‌బస్‌తో డీల్ - AIR INDIA 100 AIRBUS PLANES ORDERS
దూకుడు మీద ఉన్న ఎయిర్ ఇండియా - ఎయిర్‌బస్‌కు మరో 100 విమానాల ఆర్డర్ - మొత్తం ఒకే సంస్థకు 350 విమానాల కొనుగోలు ఆర్డర్
Published : Dec 9, 2024, 8:57 PM IST
|Updated : Dec 9, 2024, 10:19 PM IST
విమానాల కొనుగోలుతో పాటు ఏ350 విమాన విడిభాగాలు, నిర్వహణ కోసం ఎయిర్‌బస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టాటా గ్రూపు వెల్లడించింది. 2023లో ఎయిర్ ఇండియా సంస్థ ఎయిర్‌బస్ నుంచి 250 విమానాలకు ఆర్డర్ పెట్టింది. అదే సమయంలో 220 విమానాల కొనుగోలు కోసం బోయింగ్‌తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా ఎయిర్‌బస్‌తో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని మరింత విస్తరిస్తూ మొత్తం 350 విమానాల కొనుగోలుకు డీల్ కుదుర్చుకుంది ఎయిర్ ఇండియా.
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. భారత్‌లో మౌలిక సదుపాయాలు మెరుగవుతున్నాయని, ఇక్కడి యువత విదేశాలకు వెళ్లడం పెరిగిందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 470 విమానాల ఆర్డర్‌ను విస్తరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. భారత్ సహా ప్రపంచ నలుమూలాల ఎయిర్ ఇండియా సేవలను విస్తరించడం వల్ల పాటు ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.