Women Candidates In First Phase LS Polls 2024 :సార్వత్రిక ఎన్నికల సమరంలో మొదటి దశలో పోటీచేస్తున్న అభ్యర్ధులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్- ADR ప్రకటించింది. మొత్తం 1,618 మంది అభ్యర్థుల్లో కేవలం 135 మంది మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారని ఏడీఆర్ తెలిపింది. అంతేకాదు బరిలో దిగిన 1618 మందిలో 256 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించింది.
ఆ పార్టీ నేతలపైనే ఎక్కువ కేసులు!
ADR నివేదిక ప్రకారం లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో బరిలో నిలిచిన మొత్తం 1618 మంది అభ్యర్థుల్లో 256 మంది అంటే 16 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏడుగురిపై హత్య కేసులు, 19 మందిపై హత్యాయత్నం, 18 మందిపై మహిళలకు సంబంధించి అలాగే ఇతర తీవ్రమైన నేరాలు నమోదయ్యాయి. మొదటి దశలో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులపైనే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలు ఉన్నాయి.
తొలి దశలో ఆర్జేడీ ప్రకటించిన నలుగురు అభ్యర్థులపైన కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. డీఎంకే ప్రకటించిన 22 మంది అభ్యర్థుల్లో 13మందిపై, సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించిన 7మంది అభ్యర్థుల్లో ముగ్గురిపై, ఏఐటీసీ ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల్లో ముగ్గురిపై, భారతీయ జనతా పార్టీ ప్రకటించిన 77 మంది అభ్యర్థుల్లో 28మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అన్నాడీఎంకే ప్రకటించిన 36 మంది అభ్యర్థుల్లో 13మందిపై, కాంగ్రెస్ ప్రకటించిన 56 మంది అభ్యర్థుల్లో 19 మందిపై, బహుజన్ సమాజ్ పార్టీ ప్రకటించిన 86 మంది అభ్యర్థుల్లో 11 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రాలవారీగా ఇలా
క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్న అభ్యర్థులు ఉన్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. తమిళనాడులోని పార్టీలు ప్రకటించిన 945 మంది అభ్యర్థుల్లో 138పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. తర్వాతి స్థానంలో ఉత్తర్ప్రదేశ్ ఉంది. యూపీలో మొత్తం 88 మంది అభ్యర్థుల్లో 28మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.