Woman Living On Liquids For 35 Years :వైద్యుడి సూచన మేరకు ఏకంగా 35 ఏళ్ల నుంచి ఎటువంటి ఆహారం(ఘన పదార్థం) తీసుకోకుండా జీవిస్తున్నారు ఒడిశాకు చెందిన ఓ మహిళ. ఇలా ఆమె 12 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి చేస్తున్నారు. కేవలం ధ్రవ పదార్థాల(లిక్విడ్ ఫుడ్స్)ను మాత్రమే తీసుకుంటూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.
ఒడిశా బాలేశ్వర్ జిల్లాలోని అషిమిలా గ్రామానికి చెందిన 47 ఏళ్ల శాంతిలత జెనా అనే మహిళ గత 35 ఏళ్లుగా కేవలం పండ్ల రసాలు, టీలు లాంటి ధ్రవ పదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారు. శాంతిలత 12 సంవత్సరాల వయస్సు నుంచే ఆహారం తినడం మానేశారు. ఆ సమయంలో ఆమెకు తన తల్లి ఏం తినిపించినా వాంతి చేసుకునేవారు. దీంతో ఆందేళన చెందిన ఆమె తల్లిదండ్రులు ఓ డాక్టర్‌ను సంప్రదించారు. పలు రకాల పరీక్షలు జరిపిన అనంతరం జెనా శరీరానికి ఘన రూపంలో ఉండే ఆహారాలు పట్టవని కేవలం ధ్రవ రూపంలో ఉన్న వాటిని మాత్రమే ఆహారంగా ఇవ్వాలని సలహా ఇచ్చారు. ఇలా వైద్యుడి సూచన మేరకు అప్పట్నుంచి కేవలం నీళ్లు, టీ, జ్యూస్ వంటి ధ్రవాలను మాత్రమే తాగుతున్నారు శాంతిలత. అయితే ఇవి తీసుకున్నా వెంటనే ఆమెకు వాంతులు అవుతాయి అని అయినా చాలా సంవత్సరాలుగా ఆమె ఆరోగ్యంగా జీవిస్తున్నారని అని శాంతిలత జెనాకు చెందిన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
డాక్టర్లు ఏమంటున్నారు?
అయితే ఇన్నేళ్లుగా ఎటువంటి పోషకాహారం తీసుకోకున్నా ఆమె పూర్తి ఆరోగ్యంతో జీవిస్తుండటం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఇదే విషయమై ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శంతను దాస్‌ను ఈటీవీ భారత్ సంప్రదించగా ఆయన దీనిపై వివరణ ఇచ్చారు. 'ఒక మనిషి కేవలం నీటిని తీసుకోవడం ద్వారా కూడా జీవించగలడు. కానీ, అలా కొంతకాలం వరకు మాత్రమే బతకగలడు. ఇన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడం సాధ్యం కాదు. టీ, జ్యూస్‌లు లాంటి లిక్విడ్స్‌ను తీసుకున్న తర్వాత ఆమె(శాంతిలత) వాంతి చేస్తున్నప్పటికీ, వీటికి సంబంధించిన కొంత శాతం శరీరంలోనే ఉండిపోతుంది. టీకి వాడే పాలు, అందులో వేసే పంచదాలలోని కొన్ని పోషకాలు, పండ్ల రసాల్లోని పలు విటమిన్లు, మినరల్స్ వంటి పోషక విలువలు ఆమె శరీరానికి అందుతాయి. ఇవి మనిషి ఆరోగ్యంగా జీవించడానికి సహాయపడుతాయి. అయితే శాంతిలత జెనా ఆరోగ్యంగా జీవిస్తున్నప్పటికీ, ఆమె శారీరక ఆకృతిలో మాత్రం మనం ఎటువంటి ఎదుగుదలను గమనించలేము' అని చెప్పారు.