Woman Candidates MP In Karnataka : కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలిసారి అత్యధిక సంఖ్యలో మహిళలు కొంగు బిగించి ఎన్నికల రణ క్షేత్రంలో దిగుతున్నారు. జాతీయ పార్టీల నుంచి ఎనిమిది మంది మహిళలు లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిచారు. ఇలా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ నుంచి ఇంత మంది మహిళా అభ్యర్థులు ఎంపీ ఎన్నికల్లో బరిలో నిలవడం ఆసక్తి రేపుతోంది.
కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీజేపీ నుంచి ఇద్దరు మహిళలు బరిలో నిలవడం విశేషం. లోక్‌సభ ఎన్నికల చరిత్రలో కర్ణాటకలో తొలిసారి ఎక్కువమంది మహిళలు బరిలో నిలిచిన ఎన్నికలుగా ఇవి గుర్తింపు పొందాయి. రంగంలోకి దిగిన మహిళా మణులు ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఇందులో ఎవరు గెలుస్తారన్న దానిపై కన్నడిగుల్లో ఉత్కంఠ రేగుతుండగా ఫలితాలు మాత్రం జూన్ 4న రానున్నాయి.
గతంలో ఇలా
1999 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి ఒక్క మహిళ మాత్రమే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 1999 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బళ్లారి లోక్‌సభ నుంచి కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఒక మహిళ మాత్రమే కర్ణాటక నుంచి ఎన్నికయ్యారు. పార్టీలు కూడా మహిళలకు ఎక్కువగా టికెట్లు కేటాయించలేదు. కర్ణాటక శాసనసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఆమోదం తెలిపింది. తర్వాత పార్లమెంటు ఉభయ సభలు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాయి.
ఈ బిల్లులో 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి అమల్లోకి రానుంది. అప్పుడు దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంది. కానీ అంతకుముందే కర్ణాటకలో మహిళలు ఎక్కువగా సీట్లు సంపాదించి సత్తా చాటారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండు సీట్లు మహిళలకు ఇవ్వగా కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసి ఆరు సీట్లు ఇచ్చింది. జేడీఎస్ ఏ నియోజకవర్గంలోనూ మహిళలకు టిక్కెట్లు ఇవ్వలేదు.