NCP Ajit Pawar Maharashtra Election : తన రాజకీయ జీవితంపై నెలకొన్న ఎన్నో సందేహాలకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెరదించారు. మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్‌పవార్‌కు స్వయాన అన్నకొడుకే అజిత్ పవార్. 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తన తండ్రి అనంత్‌రావ్ పవార్‌ను అజిత్ పవార్ కోల్పోయారు. అనంతరం చిన్నాన్న శరద్ పవార్ బాటలో నడిచారు. 1991లో తొలిసారి బారామతి నుంచి లోక్‌సభకు ఎన్నికైన అజిత్ పవార్- శరద్‌పవార్ కోసం ఆ స్థానం ఖాళీ చేయాల్సి వచ్చింది. అదే ఏడాది బారామతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అజిత్ ఆ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. అప్పటి నుంచి అక్కడ గెలుస్తూ వస్తున్నారు.
ఏడాది క్రితం శరద్‌పవార్‌పై తిరుగుబాటుబావుటా ఎగురవేసి ఎన్డీఏ పక్షాన అజిత్ పవార్ చేరారు. ఏక్‌నాథ్ శిందే సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తనతోనే ఉండటంతో ఎన్సీపీ గుర్తు గడియారం, పార్టీ పేరు అజిత్ పవార్ వర్గానికే దక్కింది. అయితే 6 నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఘోర పరాభవం చవిచూసింది. కేవలం ఒక్క స్థానంలోనే నెగ్గింది. బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియాసూలే చేతిలో అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఓటమి చవిచూశారు. దీంతో అజిత్ పవార్ రాజకీయ జీవితంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సుప్రియా సూలేపై తన భార్యను పోటీకి దింపి తప్పు చేసినట్లు అజిత్ పవారే ఒకానొక సందర్భంలో అంగీకరించారు. కానీ ఆరు నెలల్లోనే పరిస్థితి తారుమారైంది.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పూర్తిస్థాయిలో సత్తా చాటింది. 59 స్థానాల్లో పోటీ చేస్తే 41 చోట్ల జయభేరి మోగించింది. తన కంచుకోట బారామతి అసెంబ్లీ స్థానంలో అజిత్ పవార్ లక్షకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అజిత్ పవార్‌కు వ్యతిరేకంగా శరద్ పవార్ ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. తన బంధువు NCP SP అభ్యర్థి యుగేంద్ర పవార్‌పై అజిత్ పవార్ గెలుపొందారు. అదే సమయంలో శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ 86 చోట్ల పోటీ చేసినప్పటికీ, కేవలం 10 స్థానాల్లోనే నెగ్గింది. ఇప్పటికే పలుమార్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పని చేసిన అజిత్ పవార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో ఎన్సీపీపై పట్టునిలుపుకున్నారు.
మహారాష్ట్రలో 'మహాయుతి' సునామీ- కూటమి ధాటికి కొట్టుకుపోయిన పార్టీలు ఇవే!
MVAకు చావుదెబ్బ! ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసిన మహాయుతి- 60ఏళ్లలో తొలిసారి ఇలా!