Why do People Bath After Funeral : కుటుంబ సభ్యుల్లో.. లేదా దగ్గరి బంధువుల్లో ఎవరైనా మరణిస్తే ఆచారాలు, సంప్రదాయాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత.. సమీపంలోని చెరువులోనో, వాగులోనో, మోటారు నీటితోనో స్నానాలు చేస్తారు. నగరాల్లో అయితే.. శ్మశాన వాటికల్లోని స్నానపు గదుల్లో తలస్నానం చేస్తారు. ఇది తరాలుగా కొనసాగుతున్న పద్ధతి. మరి, మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. అసలు దహన సంస్కారాల తర్వాత స్నానం ఎందుకు చేయాలని? స్నానం చేయకుండానే ఇంటికి వెళ్లొచ్చు కదా అని మీకెప్పుడైనా అనిపించిందా? మరి.. దీనివెనకున్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మానసిక ప్రశాంతత..
ఆత్మీయులు దూరమైనప్పుడు మనసులో కలిగే వేదన మాటల్లో చెప్పలేనిది. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. చనిపోయిన వారు గతంలో మనతో గడిపిన క్షణాలు, మాట్లాడిన మాటలు, సంఘటనలు అన్నీ కళ్ల ముందు మెదులుతుంటాయి. ఇక వారు కంటికి కనిపించరనే ఆలోచనే తట్టుకోలేక హృదయం బద్ధలైపోతుంది. ఆ బాధను కంట్రోల్ చేసుకోలేక గుండెలు పగిలేలా రోధిస్తారు. ఈ పరిస్థితుల్లో మెదడు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంది. ఇలాంటప్పుడు చన్నీటితో తలస్నానం చేయడం వల్ల మనసు శాంతిస్తుంది. ఆవేదన మొత్తం అప్పటికే కన్నీళ్ల రూపంలో బయటకు వెళ్లిపోయి ఉంటుంది. కాబట్టి.. స్నానం చేయడం వల్ల కాస్త ప్రశాంతత చేకూరినట్టుగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బ్యాక్టీరియా దూరం..
వ్యక్తి మరణించిన తర్వాత ఆ శరీరంలో బ్యాక్టీరియా తయారవుతుంది. ఆ శరీరాన్ని తాకిన వారికి అది అంటుకుంటుంది. ఈ విషయాన్ని పూర్వకాలంలోనే గుర్తించారు. అందుకే.. చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు నిర్వహించిన తర్వాత స్నానం చేయాలని చెబుతుంటారు. పూర్వ కాలంలో మశూచి వంటి పలు రకాల వ్యాధులు విజృంభించి వందలాది ప్రాణాలు బలిగొనేవి. ఆ రోజుల్లో మందులు, టీకాలు ఉండేవి కావు. కాబట్టి.. చనిపోయిన వారి నుంచి ఆయా రోగాలు ఇతరులకు సోకకుండా ఉండటానికి, దహన సంస్కారాల తర్వాత స్నానాన్ని ఆచార, సంప్రదాయాల్లో భాగం చేశారని చెబుతారు.
షాక్ నుంచి తేరుకోవడానికి..
అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులు దూరమైనప్పుడు ఎవ్వరైనా షాక్ గురవుతారు. ఆ బాధ నుంచి కోలుకోవడంలో స్నానం ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తల స్నానం చేయడం ద్వారా మనం కొత్తగా జీవితాన్ని ప్రారంభించినట్లుగా అనిపిస్తుందని అంటున్నారు. అలాగే ఆ క్షణంలో తలస్నానం చేయడం వల్ల.. ఆ జ్ఞాపకాలను కొంత వరకు పక్కనపెట్టే అవకాశం కలుగుతుందట.